అరాచకాల కాంగ్రెస్సా.. ఏపీ గురించి మాట్లాడేది?: ప్రధాని మోదీ

బుధవారం, 7 ఫిబ్రవరి 2018 (13:18 IST)
కేంద్రం విడుదల చేసిన బడ్జెట్‌లో ఏపీకి అన్యాయం జరిగిందంటూ పార్లమెంట్ ఎదుట, లోక్ సభ, రాజ్యసభల్లో నిరసన చేపట్టారు. ఏపీకి న్యాయం చేయాలంటూ వెల్‌లోకి ప్రవేశించి నినాదాలు చేశారు. ఈ క్రమంలో బుధవారం ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ ప్రసంగాన్ని అడ్డుకున్నారు.

ప్రధాని ప్రసంగం మొదలెట్టినా.. టీడీపీ ఎంపీలు నినాదాలను ఏమాత్రం ఆపలేరు. అయితే టీడీపీ ఎంపీల నిరసనలపై నరేంద్ర మోదీ నోరెత్తకుండా.. సభా కార్యక్రమాలను ఎవరు అడ్డుకున్నా తప్పేనని, ఎవరినీ ఉపేక్షించేది లేదని పరోక్షంగా టీడీపీ సభ్యులను హెచ్చరించారు. 
 
మోదీ తన ప్రసంగంలో ఎన్టీరామారావును గుర్తు చేసుకున్నారు. టీడీపీ ఆవిర్భావం నాటి పరిస్థితులను ప్రస్తావించారు. తెలుగువారి ఆత్మగౌరవ నినాదంతో టీడీపీ ఏర్పడిందన్నారు. కాంగ్రెస్ అరాచకాలకు వ్యతిరేకంగా తెలుగుదేశం పార్టీ పుట్టిందని.. నిదానంగా సమస్యలు పరిష్కారమవుతాయని తాను హామీ ఇస్తున్నట్లు మోదీ వ్యాఖ్యానించారు. 
 
హైదరాబాద్ విమానాశ్రయంలో ఆనాడు రాజీవ్ గాంధీ, ఓ దళిత ముఖ్యమంత్రిని అవమానించారని, అంజయ్య, పీవీ నరసింహరావు, నీలం సంజీవరెడ్డి పట్ల కాంగ్రెస్ దుర్మార్గంగా వ్యవహరించిందని ప్రధాని ఈ సందర్భంగా గుర్తు చేశారు.

ప్రధాని ప్రసంగాన్ని కాంగ్రెస్ అడ్డుకునేందుకు ప్రయత్నించినా.. మోదీ తన ప్రసంగాన్ని కొనసాగిస్తూనే.. ఆంధ్రప్రదేశ్‌లో కాంగ్రెస్ అనేక రాజకీయ దారుణాలకు పాల్పడిందని ఆరోపించారు. అలాంటి కాంగ్రెస్ పార్టీకి ఆ రాష్ట్రం గురించి మాట్లాడే హక్కు లేదని దుయ్యబట్టారు.

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు