చెంప నిమిరిన జర్నలిస్టుకు సారీ చెప్పిన తమిళనాడు గవర్నర్

బుధవారం, 18 ఏప్రియల్ 2018 (19:59 IST)
తన ఆహ్వానం మేరకు రాజ్‌భవన్‌లో జరిగిన విలేకరుల సమావేశానికి వచ్చిన ఓ మహిళా విలేఖరి పట్ల తమిళనాడు భన్వరిలాల్ పురోహిత్ ప్రవర్తించిన తీరు విమర్శలకు దారితీసింది. ఆ మహిళా విలేఖరి చెంప నిమిరారు. ఇది మీడియాలో పెద్ద వివాదాస్పదం కావడంతో గవర్నర్ దిగివచ్చారు.
 
మనువరాలి వయస్సులో ఉన్న ఆమెను అభినందించేందుకే ఆమె చెంపను తాకానన్నారు. తన చర్య వల్ల ఆ మహిళా జర్నలిస్టు బాధపడినందు వల్ల ఆమెకు క్షమాపణ చెబుతున్నట్టు బుధవారం విడుదల చేసిన ఒక పత్రికా ప్రకటనలో పేర్కొన్నారు. దయచేసి తనను తప్పుగా అర్థం చేసుకోవద్దని  గవర్నర్‌ బన్వరిలాల్‌ పురోహిత్‌ విజ్ఞప్తి చేశారు. 
 
రాష్ట్ర పెద్దగా ఉన్న తాతను సంతృప్తిపరిస్తే భవిష్యత్ బాగుంటుందని చెప్పి అనేక మంది విద్యార్థినిలతో మదురై కామరాజ్ విశ్వవిద్యాలయం ప్రొఫెసర్ నిర్మలాదేవి వ్యభిచారం చేయించారు. పైగా, వైస్ ఛాన్సెలర్‌ కావాలన్న ఉద్దేశ్యంతో ఈ పని చేయించినట్టు ఆమె పోలీసులకు ఇచ్చిన వాంగ్మూలంలో పేర్కొన్నారు. 
 
ఈ వ్యవహారంపై స్పందించేందుకు గవర్నర్ మీడియా సమావేశం ఏర్పాటు చేశారు. తనకు ఆ ప్రొఫెసర్‌ ఎవరో కూడా తెలియదంటూ బన్వరిలాల్‌ వివరణ ఇచ్చారు. ఈ సమావేశంలో ఓ మహిళా జర్నలిస్టు అడిగిన ప్రశ్నకు బదులుగా సమాధానం చెప్పకుండా, ఆమె ఆమె చెంపను నిమిరారు. గవర్నర్‌ చర్యతో అక్కడున్న వారంతా ఒక్కసారి షాకయ్యారు.తన పట్ల గవర్నర్‌ ప్రవర్తనపై మహిళా జర్నలిస్టు ట్విటర్‌లో స్పందించారు.
 
'విలేకరుల సమావేశంలో భాగంగా తమిళనాడు గవర్నర్‌ బన్వరిలాల్‌ను ప్రశ్న అడిగాను. అందుకు బదులుగా ఆయన నా చెంపను తాకారు' అంటూ మహిళా జర్నలిస్టు లక్ష్మీ సుబ్రహ్మణియన్ ట్వీట్‌ చేశారు. లైంగిక వేధింపుల ఆరోపణలను ఖండించేందుకు ఏర్పాటు చేసిన సమావేశంలో ఇలా ప్రవర్తించడం సబబు కాదన్నారు. ఒక మహిళ అనుమతి లేకుండా ఆమెను తాకడం మంచి పద్దతి కాదన్నారు. నా ముఖాన్ని పదేపదే శుభ్రం చేసుకున్నాను. కానీ ఆ మలినం నన్ను వదిలినట్లు అనిపించడం లేదు. 78 ఏళ్ల వయస్సున్న మీరు నాకు తాతయ్యలాంటి వారే కావొచ్చు. కానీ మీ చర్య నాకు తప్పుగా అన్పిస్తోంది' అంటూ ఆమె తన ట్వీట్‌లో పేర్కొన్నారు. 

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు