తమిళనాడులో కావేరీ చిచ్చు .. రాష్ట్ర వ్యాప్త బంద్.. స్తంభించిన జనజీవనం

గురువారం, 5 ఏప్రియల్ 2018 (11:24 IST)
తమిళనాడు రాష్ట్రాన్ని కావేరీ చిచ్చు ఓ కుదుపుకుదుపుతోంది. కావేరీ జలలా పంపిణీ కోసం సుప్రీంకోర్టు ఆదేశం మేరకు కావేరీ జల మండలి ఏర్పాటుకు కేంద్ర ప్రభుత్వం మొగ్గు చూపలేదు. పైగా, కావేరీ జల మండలి ఏర్పాటుపై మరింత స్పష్టత ఇవ్వాలంటూ కేంద్రం సుప్రీంకోర్టులో ఓ పిటీషన్ దాఖలు చేసింది. ఇది తమిళ ప్రజలకు తీవ్ర ఆగ్రహం తెప్చించింది. 
 
ఈ నేపథ్యంలో కావేరీ జల మండలిని ఏర్పాటు చేయాలంటూ అధికార అన్నాడీఎంకేతో పాటు.. ఇతర విపక్ష పార్టీలు కూడా గత కొన్ని రోజులుగా ఆందోళనలు చేస్తున్నాయి. ఈ నేపథ్యంలో డీఎంకేతోపాటు.. దాని మిత్రపక్షాలు కలిసి గురువారం రాష్ట్ర బంద్‌కు పిలుపునిచ్చాయి. దీంతో రాష్ట్ర వ్యాప్తంగా బంద్ సాగుతోంది. 
 
బంద్ సందర్భంగా చెన్నైలోని అన్నాశాలై, కోడంబాక్కం, నుంగంబాక్కం తదితర ప్రాంతాల్లో నిరసనలు పెల్లుబికాయి. ట్రేడ్ యూనియన్లు బంద్‌కు దూరంగా ఉన్నప్పటికీ బస్సు సర్వీసులకు ఉదయం నుంచి తీవ్ర అంతరాయం కలిగింది. రాష్ట్రంలోని పలు ప్రాంతాల నుంచి కూడా ఇదే తరహా వార్తలు అందుతున్నాయి. హోసూరు, తిరుచ్చిలో బస్సు సర్వీసులకు అంతరాయం కలిగింది. 
 
సరిహద్దులోని కర్ణాటక నుంచి బస్సు సర్వీసులను అడ్డుకున్నారు. పలు రైళ్ల రాకపోకలకూ ఇబ్బందులు ఏర్పడ్డాయి. దుకాణాలు, వాణిజ్య సంస్థలు మూసేశారు. ఉదయం నుంచి రాత్రి వరకూ డీఎంకే ఇచ్చిన బంద్‌కు రైతులు, వర్తకులు, లాయర్లు సహా పలు సంస్థలు మద్దతు తెలిపాయి. కావేరీ అంశంపై అన్నాడీఎంకే ఇప్పటికే నిరాహార దీక్ష నిర్వహించింది. 
 
ఇదిలావుంటే ఈ బంద్‌లో ప్రత్యక్షంగా పాల్గొన్న డీఎంకే వర్కింగ్ ప్రెసిడెంట్ ఎంకే స్టాలిన్‌తో పాటు... ఇతర పార్టీల నేతలు, వామపక్ష నేతలను పోలీసులు అరెస్టు చేశారు. దీంతో డీఎంకే కార్యకర్తలు మెరీనా తీరానికి చేరుకుని ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ఈ బంద్ కారణంగా జనజీవనం స్తంభించింది. 

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు