కోట్లాది మంది భారతీయుల ఆకాంక్షలకు ప్రతిరూపం : ప్రధాని నరేంద్ర మోడీ

ఆదివారం, 28 మే 2023 (14:13 IST)
కొత్తగా నిర్మించన పార్లమెంట్ భవనం 140 కోట్ల మంది భారతీయుల ఆకాంక్షలకు ప్రతిరూపం అని ప్రధాని నరేంద్ర మోడీ అన్నారు. ఈ కొత్త భవన ప్రారంభోత్సవం ఆదివారం అట్టహాసంగా జరిగింది. ఈ వేడుకలకు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ, లోక్‌సభ స్పీకర్ ఓం బిర్లాతోపాటు రాజ్యసభ డిప్యూటీ ఛైర్మన్‌, ఎంపీలు, పలువురు సీఎంలు పాల్గొన్నారు. 
 
ఈ సందర్భంగా రాజ్యసభ డిప్యూటీ ఛైర్మన్‌ హరివంశ్‌ నారాయణ సింగ్‌, లోక్‌సభ స్పీకర్‌ ఓంబిర్లాతోపాటు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ తొలి ప్రసంగం చేశారు. ‘దేశ వికాస యాత్రలో ఎప్పటికీ నిలిచిపోయే కొన్ని గడియలు వస్తాయి. అమృతోత్సవ వేళ చరిత్రాత్మక ఘటనలో ప్రజలు భాగస్వాములయ్యారు. ఇది కేవలం భవనం కాదు. 140 కోట్ల ప్రజల ఆకాంక్షల, కలల ప్రతిబింభం. ప్రపంచానికి భారత్‌ దృఢ సంకల్ప సందేశం ఈ కొత్తభవనం ఇస్తుంది. 
 
స్వాతంత్ర్య సమరయోధుల కలల సాకారమాధ్యమంగా, ఆత్మనిర్భర భారత్‌కు సాక్షిగా ఇది నిలుస్తుంది. నవ భారత్‌ కొత్త మార్గాలు నిర్దేశించుకుంటూ ముందుకెళ్తోంది. కొత్త ఆలోచనలు, సంకల్పంతో భారత్‌ ప్రగతిపథాన పయనిస్తోంది. ప్రపంచం మొత్తం మన దేశ సంకల్పం, అభివృద్ధిని గమనిస్తోంది అని ప్రధాని నరేంద్ర మోడీ వ్యాఖ్యానించారు. 
 
'దేశ ప్రజల ఆశలు, ఆకాంక్షలు కొత్త పార్లమెంట్ భవనం ద్వారా నెరవేరుతాయి. చరిత్రాత్మకమైన రోజు దేశ ప్రజలందరూ గర్వపడాలి. గత పార్లమెంటు భవనం ప్రగతికి మార్గదర్శకంగా నిలిచింది. స్వాతంత్ర్య ప్రాప్తి, రాజ్యాంగ నిర్మాణం వంటి అనేక చారిత్రక ఘట్టాలకు సాక్షిగా నిలిచింది. మారుతున్న కాలానికి అనుగుణంగా కొత్త భవనం ఆవశ్యకత ఏర్పడింది. ఆధునిక, సాంకేతిక పరిజ్ఞానంతో నూతన భవనం నిర్మాణం జరిగిందన్నారు. 
 
మున్ముందు సభ బాధ్యతలు మరింత పెరిగే అవకాశం ఉంది. మరింత మెరుగైన సభా కార్యకలాపాల కోసమే ఈ కొత్త భవన నిర్మాణం జరిగింది. రెండున్నరేళ్ల స్వల్ప వ్యవధిలోనే నిర్మించడం హర్షణీయం. రానున్న రోజుల్లో ప్రపంచ యవనికపై భారత్‌ అగ్రస్థానంలో నిలుస్తుంది. ప్రపంచానికి నేతృత్వం వహించే విధంగా భారత్‌ మారుతుంది అని డిప్యూటీ ఛైర్మన్‌ హరివంశ్‌ నారాయణసింగ్‌ అన్నారు.

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు