టీమిండియా విజయపరంపర కొనసాగాలని ఆకాంక్ష : ప్రధాని మోడీ

వరుణ్

ఆదివారం, 30 జూన్ 2024 (12:22 IST)
ఐసీసీ టీ20 వరల్డ్ కప్ మెగా ఈవెంట్‌లో విశ్వవిజేతగా భారత క్రికెట్టు నిలవడంతో ప్రధానమంత్రి నరేంద్ర మోడీ జట్టు సభ్యులను అభినందించారు. ఈ మేరకు ఆయన ఓ ట్వీట్ చేశారు. తుది పోరులో భారత సేన విజేతగా నిలిచిన తీరు చారిత్రాత్మకమంటూ అభివర్ణించారు. టీమిండియా ఈ మహత్తర విజయం సాధించడం పట్ల దేశ ప్రజలందరి తరపున శుభాభినందనలు తెలుపుతున్నానని వెల్లడించారు. ఆఖరిపోరాటంలో మీ అద్భుత ప్రదర్శన పట్ల దేశంలోని 140 కోట్ల మంది ప్రజలు గర్విస్తున్నారు అని పేర్కొన్నారు. మైదానంలో మీరు వరల్డ్ కప్ గెలిచారు... దేశంలో ప్రతి గ్రామంలో, ప్రతి గల్లీలోనూ ప్రజల హృదయాలను గెలిచారు అని ప్రధాని మోడీ వివరించారు. ఈ ప్రపంచ కప్ టోర్నీలో టీమిండియా ప్రస్థానానికి ఒక ప్రత్యేకత ఉందని, టోర్నీలో ఒక్క మ్యాచ్ కూడా ఓడిపోకుండా విజేతగా నిలిచిందని, ఇది అమోఘమైన ప్రదర్శన అని కొనియాడారు. టీమిండియా ఇదే పరంపరను కొనసాగించాలని కోరుకుంటున్నట్టు తెలిపారు. ఈ మేరకు వీడియో సందేశం విడుదల చేశారు.
 
మరోవైపు భారత జట్టుకు తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కూడా శుభాకాంక్షలు తెలిపారు. ఫైనల్ మ్యాచ్‌లో దక్షిణాఫ్రికాను టీమిండియా ఓడించిన తీరు అభినందనీయమన్నారు. వరల్డ్ కప్‌ను గెలవడం ద్వారా టీమిండియా దేశవాసులను గర్వించేలా చేసిందన్నారు. ఈ ట్రోఫీని గెలుచుకోవడం ద్వారా ప్రపంచ క్రికెట్లో భారత్‌కు ఎదురులేదని మరోసారి నిరూపించిందని సీఎం రేవంత్ రెడ్డి కొనియాదారు.
 
మెగాస్టార్ చిరంజీవి స్పందిస్తూ, ఐసీసీ టీ20 వరల్డ్ కప్‌లో టీమిండియా విజేతగా నిలవడం హర్షం వ్యక్తం చేశారు. భారత్ ఇప్పుడు ప్రపంచం అగ్రభాగాన ఉందని మురిసిపోయారు. 17 సంవత్సరాలు సుదీర్ఘ నిరీక్షణ తర్వాత టీ20 వరల్డ్ కప్‌ను గెలవడం అద్భుతం, అమోఘం అని కొనియాడారు. విరాట్ కోహ్లీ, బుమ్రా, హార్దిక్, అక్షర్, అర్షదీప్... అన్నింటికి మించి సరైన సారథి రోహిత్ శర్మకు, తిరుగులేని ఆటతీరు కనబర్చిన యావత్ జట్టుకు శిరసు వంచి వందనం చేస్తున్నాను అని చిరంజీవి తెలిపారు. నమ్మశక్యం కాని రీతిలో క్యాచ్ పట్టిన సూర్యకుమార్ యాదవ్ అదరహో అనిపించాడు అంటూ ట్వీట్ చేశారు. 

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు