దేశంలో కరోనా వైరస్ మహోగ్రరూపం దాల్చింది. కరాళ నృత్యం చేస్తోంది. ఈ వైరస్ మహమ్మారికి అనేక మంది మృత్యువాతపడుతున్నారు. దేశ వ్యాప్తంగా ఇదే పరిస్థితి నెలకొంది. ఈ నేపథ్యంలో దేశంలో పరిస్థితులను చక్కదిద్దేందుకు 'ఆరోగ్య అత్యయిక పరిస్థితి' (హెల్త్ ఎమర్జెన్సీ) విధించే అవకాశమున్నట్లు తెలుస్తోంది. ఈ నిర్ణయం తీసుకునే విషయంపై కేంద్ర మల్లగుల్లాలు పడుతోంది.
'హెల్త్ ఎమర్జెన్సీ' ప్రకటిస్తే కరోనా నియంత్రణకు మరిన్ని కఠిన, కట్టుదిట్టమైన చర్యలు తీసుకునే అధికారం కేంద్రానికి లభిస్తుంది. సోషల్ మీడియాలో తప్పుడు వార్తలు ప్రచారం చేస్తూ భయాందోళనలు వ్యాపించే వారినీ పకడ్బందీగా కట్టడి చేయవచ్చని భావిస్తున్నట్లు సమాచారం. అలాగే ఆక్సిజన్ నుంచి ఔషధాల వరకు అన్నింటి ఉత్పత్తి, సరఫరా, వినియోగంపై పూర్తిస్థాయి నియంత్రణ సాధించే అవకాశముంది.
ఇప్పటికే ట్విట్టర్‌లో ప్రధాని మోడీకి వ్యతిరేకంగా వచ్చిన వ్యాఖ్యల్ని తొలగించడం, మీడియాలో వ్యతిరేక వార్తలకు కళ్లెం వేయడం ప్రారంభించారని న్యాయ నిపుణులు అంటున్నారు. యూపీలో మీడియాలో తప్పుడు ప్రచారం చేస్తున్న వారిపై జాతీయ భద్రతా చట్టాన్ని ప్రయోగించాలని సీఎం యోగి ఆదిత్యనాథ్ ఇప్పటికే అభిప్రాయపడ్డారు. ట్విట్టర్ అయితే మోడీని ఓ విఫల ప్రధానిగా అభివర్ణిస్తున్నారు. ఇదే ట్రెండింగ్‌లో అగ్రస్థానంలో వుంది.