కరోనా మహోగ్రరూపం : తెలంగాణాలో 43 మంది - భారత్‌లో 2812 మంది మృతి

సోమవారం, 26 ఏప్రియల్ 2021 (12:28 IST)
కరోనా వైరస్ మహోగ్రరూపం దాల్చింది. ఈ వైరస్ సునామీ దెబ్బకు దేశ ప్రజల ప్రాణాలు గాల్లో కలిసిపోతున్నాయి. తెలంగాణా రాష్ట్రంలో గత 24 గంటల్లో 6,551 పాజిటివ్‌ కేసులు నమోదైనట్లు ఆరోగ్యశాఖ సోమవారం తెలిపింది. రోజువారీ కేసులు కాస్త తగ్గగా.. మరణాలు పెరిగాయి. 
 
రాష్ట్రంలో వైరస్‌ ప్రభావంతో 43 మంది మృతి చెందినట్లు పేర్కొంది. ఆదివారం ఒకే వైరస్‌ నుంచి కోలుకొని 3,804 మంది బాధితులు కోలుకొని ఇళ్లకు వెళ్లారు. రోజు రోజుకు పెరుగుతూ వస్తున్న కేసులతో యాక్టివ్‌ కేసుల సంఖ్య 65వేలు దాటింది. ప్రస్తుతం 65,597 యాక్టివ్‌ కేసులు ఉన్నాయని వైద్య, ఆరోగ్యశాఖ పేర్కొంది. నిన్న రాష్ట్రంలో 73,275 కరోనా టెస్టులు చేసినట్లు వివరించింది.
 
కొత్తగా నమోదైన కేసులతో రాష్ట్రంలో మొత్తం పాజిటివ్‌ కేసుల సంఖ్య 4,01,783కు పెరగ్గా.. ఇప్పటి వరకు 3,34,144 మంది కోలుకున్నారు. వైరస్‌ బారినపడి 2,042 మంది ప్రాణాలు కోల్పోయారు.
 
కొత్తగా నమోదైన కేసుల్లో గ్రేటర్‌ హైదరాబాద్‌లో 1,418, మేడ్చల్‌ మల్కాజ్‌గిరిలో 554, రంగారెడ్డిలో 482, నిజామాబాద్‌లో 388, సంగారెడ్డిలో 368, వరంగల్‌ అర్బన్‌లో 329, జగిత్యాలలో 276, కరీంనగర్‌లో 222, మహబూబ్‌నగర్‌లో 226, సిద్దిపేటలో 268 అత్యధికంగా కరోనా కేసులు రికార్డయ్యాయని ఆరోగ్యశాఖ వివరించింది.
 
ఇదిలావుంటే, దేశంలో కూడా రోజు రోజుకు కొత్త కేసులతో పాటు మరణాల సంఖ్య భారీగా పెరుగుతున్నది. రోజులు గడిచిన కొద్దీ మహమ్మారి ఉధృతి పెరుగుతుండడం ఆందోళన కలిగిస్తోంది. మహమ్మారి కట్టడికి పలు రాష్ట్రాలు లాక్‌డౌన్‌, నైట్‌ కర్ఫ్యూ అమలు చేస్తున్నా కేసుల సంఖ్య పెరుగుతూ వస్తున్నది. 
 
తాజాగా వరుసగా ఐదో రోజు సోమవారం రికార్డు స్థాయిలో మూడు లక్షలకుపైగా పాజిటివ్‌ కేసులు, రెండువేలకుపైగా మరణాలు నమోదయ్యాయి. గడిచిన 24 గంటల్లో 3,52,991 కరోనా కేసులు నమోదయ్యాయని కేంద్ర కుటుంబ, ఆరోగ్యశాఖ తెలిపింది. అలాగే రికార్డు స్థాయిలో 2,812 మరణాలు రికార్డయ్యాయని చెప్పింది. నిన్న ఒకే 2,19,272 మంది కోలుకొని ఇండ్లకు వెళ్లారు.
 
తాజాగా నమోదైన కేసులతో దేశంలో మొత్తం కేసుల సంఖ్య 1,73,13,163కు చేరింది. ఇప్పటివరకు 1,43,04,382 మంది కోలుకున్నారు. మహమ్మారి బారినపడి మొత్తం 1,95,123 మంది ప్రాణాలు కోల్పోయారు. ప్రస్తుతం 28,13,658 యాక్టివ్‌ కేసులు ఉన్నాయని వివరించింది. 
 
మరోవైపు ప్రపంచంలోనే రికార్డు స్థాయిలో టీకాల పంపిణీ కొనసాగుతున్నది. ఇప్పటి వరకు 14,19,11,223 డోసులు వేసినట్లు ఆరోగ్యశాఖ చెప్పింది. ఇదిలా ఉండగా నిన్న ఒకే రోజు 14,03,367 కరోనా టెస్టులు నిర్వహించినట్లు ఇండియన్‌ కౌన్సిల్ ఫర్‌ మెడికల్‌ రీసెర్చ్‌ (ఐసీఎంఆర్‌) తెలిపింది. ఇప్పటి వరకు 27.93 శాంపిల్స్‌ పరీక్షించినట్లు పేర్కొంది.

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు