అంతర్జాతీయ యోగా డే : శరీరాన్ని మెలికలు తిప్పుతూ యోగాసనం వేసిన మోడీ.. ఇంకా...

మంగళవారం, 21 జూన్ 2016 (09:08 IST)
అంతర్జాతీయ యోగా దినోత్సవ వేడుకల్లో భాగంగా ప్రధానమంత్రి నరేంద్ర మోడీ పలు ఆసనాలు వేశారు. భారత ప్రభుత్వం తరపున చండీగఢ్ వేదికగా జరిగిన యోగా దినోత్సవ వేడుకల్లో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా మోడీ పలు ఆసనాలు వేశారు. ఆయన పాల్గొన్న యోగాసన కార్యక్రమాన్ని మూడు విభాగాలుగా విభజించారు. 
 
మొదట సెట్రచింగ్‌.. అంటే తల, మెడ తిప్పటం, శరీరాన్ని మెలికలు తిప్పటం వంటి శరీరాన్ని వదులు చేసుకునే వ్యాయామాలతో కార్యక్రమం ప్రారంభమైంది. అనంతరం.. నిలబడి చేసే ఆరు ఆసనాలు వేశారు. తాడాసనం, వృక్షాసనం వంటివి ఇందులో ఉంటాయి. ఆ తర్వాత కూర్చుని చేసే శశాంకాసనం, వక్రాసనం వంటి ఐదు ఆసనాలు ఉంటాయి. భుజంగాసనం, సర్పాసనం వంటి కొన్ని కఠినమైన ఆసనాలు కూడా వేశారు. చివరగా సేతుబంధాసనం, పవనముక్తాసనం, శవాసనం వేశారు. కపాలభాతి, ప్రాణాయామం వంటి శ్వాస పీల్చే వ్యాయామాలతో శరీరాన్ని వదులు చేసుకుని కార్యక్రమాన్ని ముగించారు. 
 
కాగా, అంతర్జాతీయ యోగా దినోత్సవం నేపథ్యంలో ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ సోమవారం సూర్యనమస్కారాల భంగిమలు ఉన్న స్మారక తపాలాబిళ్లలను విడుదల చేశారు. దేశవ్యాప్తంగా 391 వర్సిటీలు, 16 వేల కాలేజీలు, 12 వేల పాఠశాలల్లో మంగళవారం యోగా దినోత్సవాన్ని నిర్వహించాయి. 

వెబ్దునియా పై చదవండి