ఫుడ్ డెలివరీ బాయ్స్ అంటూ ఇంట్లోకి దొంగలు.. రూ.23.50 లక్షలు దోచేశారు..

సోమవారం, 13 నవంబరు 2023 (10:04 IST)
కాన్పూర్‌లో ఫుడ్ డెలివరీ బాయ్స్ అంటూ దొంగలుగా మారారు ఇద్దరు యువకులు. కాన్పూర్‌లోని ఒక వ్యాపారవేత్త ఇంటిలో కుమార్తె ఇంట్లో ఒంటరిగా ఉందని గుర్తించి రూ.23.50 లక్షల నగదు, నగలను దోచుకున్నారు.
 
వివరాల్లోకి వెళితే.. చాకేరిలోని అహిర్వాన్‌లోని ఆకాష్ గంగా విహార్ కాలనీ సమీపంలో నివసిస్తున్న వ్యాపారి నరేంద్ర గుప్తా తన భార్య రష్మీ, చిన్న కుమార్తె నవ్యతో కలిసి షాపింగ్ కోసం మార్కెట్‌కు వెళ్లినట్లు తెలిపారు. ఈ సమయంలో ఆయన పెద్ద కూతురు న్యాసా ఇంట్లో ఒంటరిగా ఉంది.
 
ఆన్‌లైన్ ఫుడ్ డెలివరీ బాయ్‌లుగా నటిస్తూ ఇద్దరు నిందితులు ఆర్డర్ డెలివరీ సాకుతో వారి ఇంటికి చేరుకున్నారు. ఆర్డర్ తీసుకోవడానికి న్యాసా నిరాకరించింది. కాని యువకులు బలవంతంగా ఇంట్లోకి ప్రవేశించారు. కుమార్తె మెడపై నిందితుడు స్క్రూడ్రైవర్‌ పెట్టి చంపేస్తానని బెదిరించాడు.
 
దీంతో భయపడిన కూతురు లాకర్ తాళాలను నిందితులకు ఇవ్వగా, ఆ తర్వాత లాకర్‌లో ఉంచిన రూ.3.50 లక్షల నగదు, రూ.20 లక్షల విలువైన నగలను దుండగులు ఎత్తుకెళ్లారు. భార్యాభర్తలు అర్థరాత్రి ఇంటికి చేరుకోగా, కుమార్తె జరిగిన విషయాన్ని వారికి తెలియజేయడంతో వారు పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని దర్యాప్తు చేశారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు