గర్భిణీ మహిళ కరోనాతో మృతి.. ఆక్సిజన్ లెవల్స్ తగ్గిపోవడంతో..?

బుధవారం, 12 మే 2021 (21:24 IST)
కరోనా మహమ్మారి విజృంభణ కొనసాగుతూనే ఉంది. అయితే సెకండ్ వేవ్ లో పెద్ద సంఖ్యలో డాక్టర్లు కూడా మహమ్మారి బారిన పడుతున్నారు. తాజాగా ఢిల్లీకి చెందిన ఓ దంత వైద్యురాలికి కరోనా బారినపడి ప్రాణాలు కోల్పోయింది. ఢిల్లీకి చెందిన డాక్టర్ డింపుల్ ఆరోరా చావ్లా(34) ఏప్రిల్ మొదటి వారంలో కరోనా బారిన పడింది. అప్పుడు ఆమె ఏడు నెలల గర్భిణి.
 
కరోనా సోకడంతో ఆమెలో ఆక్సిజన్ లెవల్స్ కూడా తగ్గిపోయాయి. దీంతో ట్రీట్మెంట్ కోసం ఆమెను ఆస్పత్రిలో చేర్పించారు. ఈ క్రమంలో ఏప్రిల్ 25న ఆమె కడుపులో ఉన్న బిడ్డ చనిపోయినట్లు డాక్టర్లు నిర్ధారించారు. ఆ మరుసటి రోజే డింపుల్ ఆరోరా కూడా చనిపోయారు. అయితే కరోనా వార్డులో ట్రీట్మెంట్ పొందుతున్న సమయంలోనే ఏప్రిల్-17న తన కుబుంసభ్యులకు,స్నేహితులకు ఓ వీడియో మెసేజ్ పంపారు డింపుల్ ఆరోరా.
 
20 సెకండ్ల నిడివి గల ఆ వీడియోలో డింపుల్ ఆరోరా.. నేను అతికష్టం మీద ఈ వీడియోలో మాట్లాడుతున్నాను. ప్రతి ఒక్కరికీ నేను చెప్పదల్చుకున్నదేంటంటే.. కరోనాను ఎవరూ తేలికగా తీసుకోవద్దు. నేను మాట్లాడలేకపోతున్నాను. 
 
ప్రతి ఒక్కరూ మాస్కు ధరించండి. బయటకు వెళ్లిన సమయంలో తప్పనిసరిగా మాస్కు ధరించండి. మనం కోసం కాకుండా, మనల్ని ప్రేమించే వారి కోసం మాస్కు ధరించండి అని డింపుల్ ఆరోరా ప్రాధేయపడింది. 
 
ఈ వీడియోను డింపుల్ అరోరా భర్త రవీష్ చావ్లా సోషల్ మీడియాలో షేర్ చేశారు. పెద్ద ఎత్తున నెటిజన్లు డాక్టర్ మృతికి సంతాపం తెలియజేస్తూ పోస్ట్‌లు పెడుతున్నారు. ప్రతి ఒక్కరికీ కరోనాపై అవగాహన కల్పించాలన్నదే తన భార్య చివరి ఆశ అని రవీష్ చావ్లా తెలిపారు.

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు