ప్రభుత్వ ఉద్యోగ వేటలో భాగంగా కొన్ని నెలల పాటు కష్టపడిన చదివిన ఓ మహిళకు ఉద్యోగ పరీక్ష రాస్తుండగా పురిటి నొప్పులు వచ్చాయి. దీంతో ఆమెను హుటాహుటిన ఆస్పత్రికి తరలించగా, ఆమె పండంటి బిడ్డకు జన్మనిచ్చింది. పరీక్ష రాయలేకపోయినప్పటికీ పండంటి కుమార్తెకు జన్మనివ్వడం సంతోషంగా ఉందని ఆ మహిళ వెల్లడించింది.
ఈ సంఘటన రాజస్థాన్ రాష్ట్రంలో గత నెల 28వ తేదీన చోటుచేసుకుంది. ప్రభుత్వ ఉపాధ్యాయలు ఎంపికకు సంబంధించి ఇటీవల ఆ రాష్ట్ర ప్రభుత్వ ఉపాధ్యాయ అర్హత పరీక్షను నిర్వహించింది. గత నెల 27, 28వ తేదీల్లో ఈ పరీక్షలు జరిగాయి.
టోంక్ జిల్లా మాల్ పురాలో గత నెల 28వ తేదీన పరీక్ష రాస్తున్న అభ్యర్థులలో ప్రియాంక చౌధరి అనే గర్భిణికి పురిటినొప్పులు వచ్చాయి. దీంతో హుటాహుటిన అంబులెన్స్‌లో టోంక్ జిల్లా ఆస్పత్రికి తరలించారు. అక్కడ ఆమెకు వైద్యులు సాధారణ ప్రసంవం చేయడంతో ఆడబిడ్డకు జన్మనిచ్చింది. ప్రస్తుతం తల్లీబిడ్డా ఇద్దరూ ఆరోగ్యంగా ఉన్నారని వైద్యులు తెలిపారు. పరీక్ష మరోమారు రాసుకోవచ్చని, కానీ తమ ఇంటికి లక్ష్మీదేవి వచ్చిందని ప్రియాంక భర్త జీత్ రామ్ చౌధరి హర్షం వ్యక్తం చేశారు.