నిర్భయ దోషుల ఉరికి ఏర్పాట్లు... దోషులను వేరు చేసిన అధికారులు

శనివారం, 14 డిశెంబరు 2019 (10:40 IST)
నిర్భయ అత్యాచారం కేసులో దోషులుగా తేలిన నలుగురు నిందితులకు కోర్టు విధించిన ఉరిశిక్షలను అమలు చేసేందుకు జైలు అధికారులు సిద్ధమవుతున్నారు. ఇందులోభాగంగా పలు చర్యలు చేపట్టడమేకాకుండా, జైలులో అనేక రకాలైన ఆంక్షలు కూడా విధించారు. 
 
ముఖ్యంగా నలుగురు దోషులు ఒకరినొకరు కలుసుకోకుండా, మాట్లాడుకోకుండా వేర్వేరు గదుల్లో ఉంచారు. దోషులు ముఖేశ్‌, వినయ్‌ శర్మ, అక్షయ్‌ కుమార్‌ సింగ్‌‌లు ఇప్పటివరకు జైలులో ఉదయం వేళ ఒకరినొకరు కలిసి మాట్లాడుకునేవారు. 
 
అయితే, ఉరితీత సమయం దగ్గర పడుతుండడంతో వారు కలుసుకుని మాట్లాడుకోకుండా నిషేధం విధించారు. మరోవైపు, తీహార్ జైలులో అధికారులు పకడ్బందీ ఏర్పాట్లు చేశారు. ఇందుకోసం తమిళనాడు నుంచి ప్రత్యేక పోలీసు దళాన్ని రప్పించారు. 
 
మండోలీ జైలులో ఉన్న మరో దోషి పవన్ కుమార్ గుప్తాను అత్యంత రహస్యంగా సాయుధ గార్డుల భద్రత మధ్య తీహార్ జైలుకు తీసుకువచ్చారు. జైలులోని ఉరితీసే గదిని శుభ్రం చేశారు. తుప్పు పట్టిన ఉరిస్తంభాన్ని శుభ్రం చేయించి విద్యుత్ దీపాలను ఏర్పాటు చేశారు. 
 
మరోవైపు, నిర్భయ దోషులను వెంటనే ఉరితీయాలని ఢిల్లీ సీఎం అరవింద్‌ కేజ్రీవాల్‌ డిమాండ్‌ చేశారు. మరణశిక్షను అమలుచేయడానికి మిగిలిన అన్ని ప్రక్రియలను వెంటనే పూర్తిచేసి వీలైనంత త్వరగా దోషులను ఉరితీయాలన్నారు. యావత్‌ దేశ ప్రజానీకం నిర్భయకు న్యాయం జరుగాలంటూ.. దోషులను తక్షణమే ఉరితీయాలంటూ కోరుతున్నారని చెప్పారు.

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు