సోషల్ మీడియాలో చండీగఢ్ యూనివర్శిటీ విద్యార్థినిలు ప్రైవేట్ వీడియోలు

ఆదివారం, 18 సెప్టెంబరు 2022 (11:16 IST)
పంజాబ్ రాష్ట్రంలోని మొహాలీలో ఉన్న చండీగఢ్ విశ్వవిద్యాలయానికి చెందిన విద్యార్థినిలు ఆందోళనకు దిగారు. తమ ప్రైవేట్ వీడియోలు సోషల్ మీడియాలో హల్చల్ చేయడంతో వారంతా శనివారం అర్థరాత్రి ఆందోళనకు దిగారు. 
 
తమతో పాటు హాస్టల్‌లో ఉంటున్న ఓ విద్యార్థిని ఈ పాడుపనికి పాల్పడిందని సహచర విద్యార్థినిలు ఆరోపిస్తున్నారు. తాము బాత్‌రూముల్లో స్నానాలు చేస్తుండగా వీడియోలు తీసిందని పేర్కొంటున్నారు. 
 
దీంతో పోలీసులు ఆమెను అదుపులోకి తీసుకుని ప్రశ్నిస్తున్నారు. కాగా, వీడియోల వల్ల కొందరు ఆత్మహత్యకు యత్నించారని విద్యార్థులు ఆరోపించారు. అయితే ఈ ఆరోపణలను పోలీసులు, వర్సిటీ అధికారులు ఖండించారు. వీడియో వ్యవహారం బయటపడగానే ఓ యువతి అస్వస్థతకు గురైందని పోలీసులు తెలిపారు. ఆమెను దవాఖానకు తరలించామని, ప్రస్తుతం ఆమె క్షేమంగానే ఉందన్నారు.
 
మరోవైపు, ఈ వ్యవహారంపై పోలీసులు కేసు నమోదు చేసి విచారణ ప్రారంభించారని డీఎస్పీ రూపిందర్ కౌర్ తెలిపారు. ఓ నిందితురాలిని అరెస్టు చేశామన్నారు. దోషులకు తప్పనిసరిగా శిక్షపడేలా చేస్తామని, విద్యార్థులు ఆందోళనలు విరమించాలని కోరారు.
 
ఇదిలావుంటే, విద్యార్థినిల ఆందోళనపై రాష్ట్ర విద్యాశాఖ మంత్రి హర్జోత్‌ సింగ్‌ బైన్స్‌ స్పందించారు. వర్సిటీ విద్యార్థులు శాంతి యుతంగా ఉండాలని కోరారు. దోషులను ఎట్టిపరిస్థితుల్లో వదిలే ప్రసక్తే లేదని స్పష్టం చేశారు. ఇది చాలా సున్నితమైన విషయమని, మన అక్కాచెల్లెళ్లు, కూతుళ్ల గౌరవానికి సంబంధించిందన్నారు. మీడియాతోపాటు మనమంత ఇలాంటి వాటిపై అప్రమత్తంగా ఉండాలని సూచించారు.
 
కాగా, హాస్టల్‌లో తమతో పాటు ఉంటున్న ఓ మహిళా విద్యార్థిని తన సహచరుల స్నానాలు చేస్తుండగా, తీసిన వీడియోలను హిమాచల్ ప్రదేశ్ రాష్ట్రలోని సిమ్లాకు చెందిన ఓ వ్యక్తికి పంపించగా, ఆయన వాటిని ఎంఎంఎస్ క్లిప్స్‌గా మార్చి ఇంటర్నెట్‌లో అప్‌లోడ్ చేయడంతో ఈ ప్రైవేట్ వీడియోల వ్యవహారం వెలుగులోకి వచ్చింది. 

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు