గత 2019 ఫిబ్రవరి 14వ తేదీన జమ్మూకాశ్మీర్ రాష్ట్రంలోని పుల్వామా జిల్లాలో భారత సైనిక బలగాలపై పాకిస్థాన్ ప్రేరేపిత ఉగ్రవాదులు దాడికి తెగబడిన రోజు. ఈ దాడిలో 40 మంది భారత జవాన్లు ప్రాణాలు కోల్పోయారు. ఆ తర్వాత భారత్, పాకిస్థాన్ దేశాల మధ్య ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. పాకిస్థాన్‌పై భారత్ యుద్ధానికి దిగొచ్చంటూ ప్రచారం జరిగింది.
అయితే, ఫిబ్రవరి 26వ తేదీ వేకువజామున ప్రపంచం మొత్తం గాఢనిద్రలో ఉన్న సమయంలో భారత వైమానిక దళం పాక్ ఆక్రమిత కాశ్మీర్‌లోని ఉగ్రవాద శిబిరాలపై మెరుపు దాడులు (సర్జికల్ స్ట్రైక్స్) జరిపాయి. ఈ దాడిలో భారత వైమానికి దళాలు ఉగ్ర తండాలపై బాంబుల వర్షం కురిపించాయి.
దీంతో అనేక మంది ఉగ్రవాదులు మృత్యువాతపడ్డారు. ఉగ్రవాదుల స్థావరాలు నేలమట్టమయ్యాయి. అలా, పుల్వామా దాడికి భారత్ సర్జికల్ దాడుల పేరుతో ప్రతీకారం తీర్చుకుంది. వీరమరణం పొందిన 40 మంది వీర సైనికులకు ఆత్మశాంతి కలిగించారు. అందుకే ఫిబ్రవరి 26వ తేదీన భారతీయులంతా భారత వైమానిక దళానికి సెల్యూట్ చెబుతున్నారు.