ఇప్పటివరకు క్రికెటర్లకు, క్రీడాకారులకు మాత్రమే డోపింగ్ పరీక్షలు నిర్వహిస్తూ వచ్చారు. ఇకపై ప్రభుత్వ ఉద్యోగులకు కూడా ఈ తరహా పరీక్షలు నిర్వహించనున్నారు. ఈ మేరకు పంజాబ్ రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది.
పంజాబ్ రాష్ట్రంలో డ్రగ్స్ అక్రమ రవాణా విచ్చలవిడిగా సాగుతున్న విషయం తెల్సిందే. దీన్ని అరికట్టేందుకు ప్రభుత్వం చర్యలు చేపట్టింది. ఇందులోభాగంగా అక్రమంగా డ్రగ్స్ సరఫరా చేస్తున్న స్మగ్లర్లకు మరణశిక్ష విధించాల్సిందిగా కోరుతూ రాష్ట్ర ముఖ్యమంత్రి కెప్టెన్ అమరీందర్ సింగ్ కేంద్ర హోంమంత్రిత్వ శాఖకు లేఖ రాశారు.
ఇప్పుడు అన్ని ప్రభుత్వ ఉద్యోగాల్లో పని చేస్తున్న వారికి డోపింగ్ టెస్ట్ తప్పని సరిగా నిర్వహించాలని ఆదేశాలు జారీ చేశారు. పోలీసులతో పాటు కొత్తగా ప్రభుత్వ ఉద్యోగాల్లో చేరే వారికి, ఇప్పటికే ఉద్యోగాలు చేస్తూ పదోన్నతులు పొందే ఉద్యోగులకు డోపింగ్ టెస్టు నిర్వహించడం తప్పనిసరి అని సీఎం అమరీందర్ సింగ్ ఆదేశాలు జారీచేశారు.
ఉద్యోగ ఎంపిక ప్రక్రియలోని ప్రతీ దశలో డోపింగ్ టెస్ట్ జరపాలని ఆయన సూచించారు. ఈ ఆదేశాలను తప్పనిసరిగా పాటించేలా చూడాల్సిందిగా ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిని ఆదేశించారు. ఉద్యోగులకు ఏటా నిర్వహించే మెడికల్ టెస్ట్‌లోను డోపింగ్ పరీక్ష జరపాలన్నారు. మాదక ద్రవ్యాల వ్యాప్తిని నియంత్రించేందుకు సీఎం అమరీందర్ సింగ్ పలు కీలక నిర్ణయాలు తీసుకుంటున్నారు.