వివాదాస్పద మాత రాథేమా అలియాస్ సుఖ్వీందర్ కౌర్‌పై విశ్వ హిందూ పరిషత్ (వీహెచ్‌పీ) సభ్యుడు సురేందర్ మిట్టల్ సంచలన ఆరోపణలు చేశారు. దైవాంశ సంభూతురాలిగా చెప్పుకునే రాథేమా.. ప్రేమ పేరిట తనను తీవ్రంగా వేధించిందని ఆరోపించారు. ‘ఐ లవ్ యూ’ అంటూ రకరకాలుగా ప్రలోభపెట్టేందుకు ప్రయత్నించేదనీ... తీరా ఆమె ముందుకు వెళితే నానా శాపనార్థాలు పెట్టేదని సురేందర్ పేర్కొన్నాడు.
దీనిపై ఆయన స్పందిస్తూ, "ఇది రెండేళ్లనాటి మాట. మీడియాలో కూడా విస్తృతంగా ప్రసారం అయింది. ఆమెకు నా తరపు న్యాయవాది నోటీసు కూడా జారీచేశారు. ఇప్పుడు ఆమెపై కోర్టు ధిక్కార నోటీసులు కూడా ఫైల్ చేశాం. హైకోర్టు ఆమెపై చర్యలు తీసుకుని న్యాయం చేస్తుందని ఆశిస్తున్నాను. ప్రత్యేకించి బాబాలు, స్వామీజీల పేరిట నకిలీ గుర్తింపుతో దందాలు నడుపుతున్న వాళ్లను వెలుగులోకి తీసుకురావాలి.." అని మిట్టల్ పేర్కొన్నాడు.
రాథేమాపై పంజాబ్ హర్యానా ఉమ్మడి హైకోర్టు గత మూడు రోజుల క్రితం కొరడా ఝళింపించిన సంగతి తెలిసిందే. సురేందర్ మిట్టల్ ఫిర్యాదు మేరకు ఆమెపై ఎఫ్ఐఆర్ నమోదు చేయాలని పంజాబ్ పోలీసులను మంగళవారం హైకోర్టు ఆదేశించింది. దీంతో ఆమె వ్యవహారం ఇపుడు చర్చనీయాంశంగా మారింది. ఇటీవలే డేరాబాబా గుర్మీత్ సింగ్‌కు సీబీఐ ప్రత్యేక కోర్టు 20 యేళ్ల జైలు శిక్ష విధించిన నేపథ్యంలో వివాదాస్పద మాత రాథేమా వ్యవహారంపై ఆరోపణలు రావడం గమనార్హం.