తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ విజయం సాధిస్తుందని ఆ పార్టీ నేత రాహుల్ గాంధీ జోస్యం చెప్పారు. అలాగే, మిగిలిన నాలుగు రాష్ట్రాల్లో కూడా మంచి ఫలితాలు వస్తాయని ఆయన పేర్కొన్నారు. ప్రస్తుతానికి మధ్యప్రదేశ్, ఛత్తీస్‌గఢ్‌లలో పార్టీ విజయం ఖాయమని, రాజస్థాన్‌లో చాలా దగ్గరి పోటీ ఉందని, అయినప్పటికీ గెలుపొందుతామన్నారు. ఓ వార్తాసంస్థ కార్యక్రమంలో రాహుల్ గాంధీ ఈ మేరకు మాట్లాడారు. తెలంగాణలో భారతీయ జనతా పార్టీ క్షీణించిందని.. అక్కడ ఆ పార్టీ పనైపోయిందని వ్యాఖ్యానించారు. మరికొన్ని నెలల్లో మధ్యప్రదేశ్, రాజస్థాన్, తెలంగాణ, ఛత్తీస్‌గఢ్, మిజోరంలలో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న విషయం తెలిసిందే.
'దేశ సమస్యల నుంచి ప్రజల దృష్టిని మళ్లించేందుకే జమిలి ఎన్నికలు, దేశం పేరు మార్పు, రమేశ్ బిధూరి వ్యవహారం వంటివాటిని భాజపా తెరపైకి తెస్తోంది. అదానీ వ్యవహారంపై వచ్చిన మీడియా కథనాల నుంచి దృష్టి మళ్లించేందుకు పార్లమెంటు ప్రత్యేక సమావేశాలు నిర్వహించింది. కుల గణన డిమాండ్ నుంచి తప్పించుకునేందుకు లోక్‌సభలో భాజపా ఎంపీ రమేశ్ బిధూరి వ్యవహారాన్ని తీసుకొచ్చింది. అయితే.. ఈ తరహా వ్యూహాలను ఎలా ఎదుర్కోవాలో నేర్చుకున్నాం. కర్ణాటక ఎన్నికల్లో ఇలాంటి వాటికి అడ్డుకట్ట వేశాం' అని రాహుల్ పేర్కొన్నారు.
మహిళా రిజర్వేషన్లకు జనగణన, డీలిమిటేషన్‌లతో సంబంధం లేదని.. రేపు ఉదయాన్నే ఈ రిజర్వేషన్లను అమలు చేయొచ్చన్నారు. ప్రస్తుతం విపక్షాలన్నీ కలిసికట్టుగా పని చేస్తున్నాయని, 2024 సార్వత్రిక ఎన్నికల్లో భాజపా ఆశ్చర్యానికి గురవుతుందని రాహుల్ గాంధీ అన్నారు.