కరోనాను తరిమికొట్టలేం.. లాక్ డౌన్‌తో కొద్దికాలం మాత్రం ఆపగలం..?

గురువారం, 16 ఏప్రియల్ 2020 (21:58 IST)
కరోనాపై పోరాటానికి లాక్ డౌన్ విధింపు పరిష్కారం కాదని కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ తెలిపారు. ప్రభుత్వం మొదట టెస్టింగ్ ప్రక్రియను పెద్ద ఎత్తున చేపట్టాలని సూచించారు. ఈ ప్రక్రియను ముమ్మరం చేస్తేనే ఈ మహమ్మారికి అడ్డుకట్ట వేయగలుతామని వెల్లడించారు. ఎలా చూసినా ఈ వైరస్‌ను తరిమి కొట్టజాలమని, లాక్‌డౌన్ విధిస్తే కొద్దికాలం మాత్రం ఆపగలుగుతామని రాహుల్ పేర్కొన్నారు. 
 
టెస్టింగ్ తప్పనిసరి అంటూ ఓ వీడియో యాప్ ద్వారా మీడియాతో కాంటాక్ట్ చేశారు. ఈ వైరస్‌ను ప్రభుత్వం తరుముతోంది.. కానీ దీని అసలైన లక్షణాలు మనకు అవగతం కావడంలేదన్నారు. దేశంలో ప్రస్తుతం టెస్టింగ్ లెవెల్ చాలా తక్కువ స్థాయిలో ఉందని, ఈ స్థాయిని వ్యూహాత్మకంగా పెంచాలని ఆయన సలహా ఇచ్చారు.
 
కరోనా మహమ్మారి విజృంభిస్తూనే వుంది. దేశంలో రోజురోజుకు పాజిటివ్ కేసుల సంఖ్య పెరుగుతూనే ఉంది. ఇప్పటి వరకు దేశ వ్యాప్తంగా కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 12,759కి చేరింది. వీటిలో ప్రస్తుతం 10,824 కేసులు యాక్టివ్‌గా ఉన్నాయి. ఇక దేశం మొత్తంగ కరోనా బారినపడి గురువారం నాటికి 420 మంది ప్రాణాలు కోల్పోయారు. ఇప్పటి వరకు కరోనా నుంచి బయటపడి 1515 మంది డిశ్చార్జ్‌ అయ్యారు.
 
ఇక గడిచిన 24 గంటల్లో 826 కొత్త కేసులు నమోదయ్యాయి. ఇక కరోనా బారినుంచి బయటపడి ఆస్పత్రుల నుంచి 171 మంది డిశ్చార్జ్ అయ్యారు. ఇక కరోనా ఎఫెక్ట్‌తో 28 మరణించినట్లు కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ వెల్లడించింది.

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు