కాంగ్రెస్ అధ్యక్షుడిగా రాహుల్ గాంధీ ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. అధ్యక్ష పదవి కోసం రాహుల్ మాత్రమే నామినేషన్ దాఖలు చేయడం, నామినేషన్ ఉపసంహరణ గడువు సోమవారం మధ్యాహ్నం మూడు గంటలతో ముగియడంతో ఆయన ఎన్నిక ఏకగ్రీవమైంది. ఈ నెల 16న ఆయన సోనియా గాంధీ నుంచి పార్టీ బాధ్యతలు స్వీకరించనున్నారు. దీంతో 19 ఏళ్ల తర్వాత కాంగ్రెస్ పార్టీ పగ్గాలు ఓ తరం నుంచి మరో తరానికి చేతులు మారనున్నాయి.
అత్యధికకాలం కాంగ్రెస్ అధ్యక్షురాలిగా ఉన్న రికార్డు సోనియా గాంధీ పేరిట ఉంది. రాహుల్ ఎన్నికను కాంగ్రెస్ సెంట్రల్ ఎలక్షన్ అథారిటీ చైర్మన్ మూలపల్లి రామచంద్రన్ ప్రకటించారు. ఒక అభ్యర్థి పేరు మీదే మొత్తం 89 నామినేషన్లు వచ్చాయి. రాహుల్‌కు పోటీగా ఎవరూ లేరు. దీంతో ఆయననే కాంగ్రెస్ అధ్యక్షుడిగా ప్రకటిస్తున్నాం.
కాగా, రాహుల్ గాంధీ కాంగ్రెస్ అధ్యక్షుడిగా ఈ నెల 16న బాధ్యతలు చేపట్టనున్నారు. ప్రస్తుతం కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలిగా రాహుల్ గాంధీ తల్లి సోనియా గాంధీ ఉన్న విషయం తెలిసిందే. ఆమె నుంచి రాహుల్ పార్టీ పగ్గాలు స్వీకరిస్తారు. గాంధీ - నెహ్రూ కుటుంబంలో కాంగ్రెస్ పార్టీ అధ్యక్ష పదవి చేపట్టిన ఐదో వ్యక్తిగా రాహుల్ గాంధీ నిలిచారు. రాహుల్ గాంధీ ప్రత్యక్ష రాజకీయాల్లోకి 2004లో అరంగేట్రం చేశారు. రాజకీయాల్లోకి వచ్చిన 13 ఏళ్ల తర్వాత ఆయన అధ్యక్ష పీఠంపై కూర్చుంటున్నారు. ప్రస్తుతం ఆయన అమేథీ నియోజక వర్గ ఎంపీగా, 2013 నుంచి పార్టీ ఉపాధ్యక్షుడిగా ఉంటున్న విషయం తెల్సిందే.