కేంద్ర బడ్జెట్ 2017పై కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ పెదవి విరిచారు. బడ్జెట్‌లో తాము మెరుపుల కోసం ఎదురుచూస్తే.. అలాంటివేమీ లేకుండా ప్రసంగం చాలా చప్పగా ముగిసిందని రాహుల్ వ్యాఖ్యానించారు. బడ్జెట్ అంతా షేర్-షాయరీలేనని రాహుల్ గాంధీ వ్యాఖ్యానించారు. యువతకోసం, రైతుల కోసం కేంద్ర బడ్జెట్‌లో ఏమీ చేయలేదని రాహుల్ తెలిపారు.
రాజకీయ పార్టీలకు విరాళాల విషయంలో పారదర్శకత పాటించేందుకు తీసుకునే ఎలాంటి చర్యలకైనా తాము మద్దతిస్తామన్నారు. బుధవారం కేంద్ర ప్రభుత్వం పార్లమెంటులో ప్రవేశపెట్టిన 2017-18 సార్వత్రిక బడ్జెట్ తీవ్రంగా నిరాశపర్చిందని రాహుల్ గాంధీ పేర్కొన్నారు. బడ్జెట్ వల్ల రైతులకు, యువతకు ఏమాత్రం ఉపయోగం లేదని చెప్పుకొచ్చారు.
ఇదిలా ఉంటే.. ఇకపై దేశ ఆర్థికవ్యవస్థలో పెనుమార్పులు వస్తాయని ప్రధాని మోదీ అన్నారు. చరిత్రాత్మక బడ్జెట్‌ను ప్రవేశపెట్టిన అరుణ్ జైట్లీకి అభినందనలు తెలిపారు. రైల్వే బడ్జెట్‌ను విలీనం చేయడం ద్వారా మొత్తంగా రవాణా వ్యవస్థను ఒకే గొడుగుకిందకు తెచ్చామని మోదీ పేర్కొన్నారు. రైల్వే బడ్జెట్‌లో భద్రత నిధి కీలకమన్నారు. నల్లధనం నియంత్రణకు కృషి చేస్తామని మోదీ స్పష్టం చేశారు.