రాహుల్ 'ఖాట్‌‌పే' చర్చ ముగియగానే మంచాల కోసం ఘర్షణ... ఎక్కడ?

బుధవారం, 7 సెప్టెంబరు 2016 (06:53 IST)
కాంగ్రెస్ పార్టీ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ చేపట్టిన కిసాన్ యాత్రలో భాగంగా రైతులతో ముఖాముఖి కార్యక్రమం నిర్వహించారు. దీనికి 'ఖాట్‌‌పే చర్చ' అనే నామకరణం చేశారు. ఈ కార్యక్రమంలో భాగంగా రైతులు, రాహుల్‌ కూర్చొని మాట్లాడుకొనేందుకు 2 వేల కొత్త మంచాలను కాంగ్రెస్ నేతలు తయారు చేయించారు. 
 
ఈ రైతులతో ముఖాముఖి చర్చా కార్యక్రమం ముగిసిందో లేదో సభకు హాజరైన రైతులు, ప్రజలు కొత్త మంచాలను తమ ఇళ్లకు తీసుకెళ్లేందుకు ఎగబడ్డారు. దీంతో సభాప్రాంగణంలో పెద్ద ఎత్తున ఘర్షణ చోటుచేసుకొంది. సభ ముగిసిన కొద్ది నిమిషాలకే అక్కడ ఏర్పాటు చేసిన 2 వేల మంచాలు మాయమైపోయి సభాప్రాంగణం బోసిపోయి కనిపించింది. 
 
అయితే తొలిరోజే ఖాట్‌పే చర్చ రసాభాసగా మారడంతో కాంగ్రెస్‌ పెద్దలు దీనిపై పునరాలోచనలో పడ్డారు. కాంగ్రెస్‌ ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత కిషోర్‌ ‘ఖాట్‌పే చర్చ’ ఆలోచనను తెరపైకి తెచ్చిన విషయం తెల్సిందే. ఇదిలావుండగా, వచ్చే ఏడాది ఉత్తరప్రదేశ్‌ అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో రాష్ట్రంలోని డియోరియా నుంచి ఢిల్లీ వరకు 2500 కిలోమీటర్ల మేర కిసాన్‌ యాత్రను రాహుల్‌ మంగళవారం ప్రారంభించారు. 

వెబ్దునియా పై చదవండి