'25 సంవత్సరాలుగా జైలులోనే ఉన్నాను. ఇంత సుదీర్ఘకాలం జైలులో ఉన్న మహిళా ఖైదీని నేనే కావచ్చు. నేను కంటితడి పెట్టని రోజంటూ లేదు. అన్నా (డీఎంకే వ్యవస్థాపకుడు) పుట్టినరోజు వంటి ఎన్నో ముఖ్యమైన రోజులు వస్తున్నాయి. వెళ్తున్నాయి. వందలాది మహిళా ఖైదీలు విడుదలవుతున్నారు. దురదృష్టం కొద్దీ నేను మాత్రం విడుదలకు నోచుకోవడం లేదు. జైలు నుంచి ఎప్పటికైనా విడుదలవుతాననే ఆశలు కూడా ఆవిరవుతున్నాయి. యూకేలో ఉన్న నా కూతుర్ని ఎప్పటికైనా చూడగలనా, ఆమెకు పెళ్లి చేయగలనా అనేది కాలమే చెప్పాలి' అంటూ నళిని తన ఆవేదన వ్యక్తం చేసింది.
కాగా, జైలులో చాలాకాలంగా మగ్గుతున్న మహిళా ఖైదీ నళిని అని, తమిళనాడు ప్రభుత్వం రాజ్యాంగపరంగా సంక్రమించిన అధికారాలను ఉపయోగించి ఉంటే నళిని ఇప్పటికే విడుదలై ఉండేదని, అయితే ప్రభుత్వం నేర శిక్షాస్మృతిలోని నిబంధలను పదేపదే వల్లెవేస్తోందన్నారు. 2000లో జాతీయ మహిళా కమిషన్ చొరవ తీసుకోవడంతోనే నళినికి విధించిన ఉరిశిక్షను జీవిత ఖైదుగా మార్చారని చెప్పారు. కాగా, తాను జైలులో అనుభవిస్తున్న మానసిక వేదనను నళిని ఎన్‌సీడబ్ల్యూ దృష్టికి తీసుకువచ్చింది.