దటీజ్ వెంకయ్య స్పెషల్ : నాలుగోసారి రాజ్యసభకు వెళుతున్న పార్టీ నేతగా రికార్డు!

బుధవారం, 25 మే 2016 (09:43 IST)
భారతీయ జనతా పార్టీకంటూ ఓ సిద్ధాంతం ఉంది. ఈ పార్టీ తరపున ఎవరినైనా మూడుసార్లు మాత్రమే రాజ్యసభకు నామినేట్ చేస్తుంటారు. కానీ, వెంకయ్య నాయుడు విషయంలో మాత్రం మినహాయింపు ఇచ్చారు. దీనికి కారణం ఆయనకు అటు పార్టీలో ఇటు ప్రధాని మోడీ సర్కారులో ఉన్న ప్రాధాన్యత అది. అందుకే నాలుగో సారి కర్ణాటక నుంచే రాజ్యసభకు ప్రాతినిథ్యం వహించనున్నారు. 
 
మంగళవారం స్మార్ట్‌సిటీల జాబితాను విడుదల చేస్తున్న సమయంలో బెంగళూరు సిటీ తాజాగా స్మార్ట్‌ సిటీల రేసులో చేరిందని ఆయన ప్రకటించారు. ఆ సమయంలో 'బెంగళూరు... కర్ణాటక రాజధాని. మై స్టేట్‌ కర్ణాటక' అని నొక్కిచెప్పారు. దీన్ని బట్టి చూస్తే వెంకయ్య అక్కడి నుంచే రాజ్యసభకు వెళ్తున్నారని ఖాయమైందని రాజకీయ పరిశీలకులు భావిస్తున్నారు.
 
ఈ మేరకు ఇప్పటికే పార్టీ కర్ణాటక శాఖ వెంకయ్యను రాజ్యసభకు పంపే విషయానికి సంబంధించి తీర్మానం చేసింది. ఒక నేతకు మూడు పర్యాయాలే రాజ్యసభ సభ్యత్వం అన్న పరిమితిని కూడా పార్టీ జాతీయ నాయకత్వం వెంకయ్య విషయంలో సడలించింది. జాతీయ నాయకత్వం నుంచి వచ్చిన ఆదేశాలతోనే కర్ణాటక శాఖ వెంకయ్యకు టికెట్ ఇవ్వాలని తీర్మానించింది. ఈ కార్యరంగమంతా పూర్తి అయినందుననే మంగళవారం మీడియా సమావేశంలో వెంకయ్య... కర్ణాటకను 'మై స్టేట్' అంటూ సంబోధించారని విశ్లేషకులు భావిస్తున్నారు. 

వెబ్దునియా పై చదవండి