అయోధ్య నగరంలో కొత్తగా నిర్మించిన రామ మందిరంలో బాల రాముడు కొలువు దీరాడు. దరశరథ నాథుడి ప్రాణప్రతిష్ట కార్యక్రమం సోమవారం అంగరంగ వైభవంగా జరిగింది. వేద పండితుల మంత్రోచ్ఛారణల మధ్య, ప్రధాన యజమానిగా ప్రధాని నరేంద్ర మోడీ ఈ క్రతువును పూర్తిచేశారు.
నల్లరాతిపై చెక్కిన బాల రాముడి ప్రతిమ ఇది. నీలమేఘశ్యాముడంటూ రామాయణంలోని వర్ణనకు అనుగుణంగా ఈ రాతిని ఎంచుకున్నారు. బాల రాముడి విగ్రహాన్ని స్వర్ణ, వజ్రాభరణాలతో అలంకరించారు. రాజకుటుంబ ఠీవీని ప్రదర్శించేలా ఆభరణాలతో అలంకరించారు.
స్వచ్ఛమైన బంగారంతో విల్లంబులు తయారు చేసి బాల రాముడి చేతిలో అలంకరించారు. రాముడు ఆజానుభాహుడని రామాయణంలో వర్ణించిన విషయం తెలిసిందే. దీనికి ప్రతీకగా బాల రాముడి చేతులను పొడవుగా, మోకాళ్ల వరకు చేరేంత పొడవుతో తీర్చిదిద్దారు. ఓ చేతిలో బాణం పట్టుకుని, మరో చేతితో ఆశీర్వాదం ఇస్తున్న రూపంలో విగ్రహాన్ని మలిచారు.