2024 జనవరి ఒకటో తేదీన రామాలయం ప్రారంభం : అమిత్ షా

శుక్రవారం, 6 జనవరి 2023 (07:56 IST)
ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోని అయోధ్యలో నిర్మిస్తున్న రామాలయం పనులు శరవేగంగా సాగుతున్నాయి. ఇపుడు ఈ ఆలయ ప్రారంభం తేదీని కేంద్ర హోం మంత్రి అమిత్ షా తాజాగా ప్రకటించారు. త్రిపుర అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న ఆయన ఈ ఆలయ ప్రారంభోత్సవంపై ఓ ప్రకటన చేశారు. వచ్చే యేడాది జనవరి ఒకటో తేదీన రామాలయాన్ని ప్రారంభిస్తామని తెలిపారు. 
 
గురువారం త్రిపురలోని సబ్రూంలో జరిగిన ఎన్నికల సభలో ఆయన పాల్గొన్నారు. వచ్చే యేడాది జనవరి ఒకటో తేదీ నాటికా రామాలయం ప్రారంభానికి సిద్ధమవుతుందన్నారు. రాహుల్ బాబా సబ్రూం నుంచి చెబుతున్నా.. 2024 జనవరి ఒకటో తేదీ నాటికి రామాలయం సిద్ధమవుతుంది అని చెప్పారు. 
 
పనిలోపనిగా త్రిపురలో ప్రధాన ప్రతిపక్షాలైన సీపీఎం, కాంగ్రెస్ పార్టీలను లక్ష్యంగా చేసుకుని ఆయన విమర్శలు గుప్పించారు. ఈ రెండు పార్టీలు కలిసి అయోధ్యలో రామాలయం నిర్మించకుండా ఏళ్లపాటు ఆ సమస్యను కోర్టులో నానబెట్టారని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. 
 
భారత్‌ జోడో యాత్ర చేస్తున్న కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీకి రామాలయం ట్రస్ట్ ప్రతినిధుల్లో పలువురు సంఘీభావం తెలిపారు. ఈ నేపథ్యంలోనే అమిత్ షా కీలక వ్యాఖ్యలు చేశారు. సో.. అమిత్ షా వ్యాఖ్యలను బట్టి చూస్తే వచ్చే యేడాది జరిగే పార్లమెంట్ ఎన్నికల్లో రామాలయ అంశాన్ని బీజేపీ ప్రధాన ప్రచార అస్త్రంగా ఉపయోగించుకునేందుకు ప్లాన్ వేసినట్టుగా తెలుస్తుంది. 

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు