ఎయిరిండియా మేనేజర్ శివకుమార్ పిచ్చోడు.. నేను సారీ చెప్పను: గైక్వాడ్

శనివారం, 8 ఏప్రియల్ 2017 (12:48 IST)
పూణే నుంచి ఢిల్లీకి గత నెలలో ప్రయాణించిన ఎంపీ గైక్వాడ్.. 60ఏళ్ల ఎయిరిండియా ఉద్యోగిని 25సార్లు చెప్పుతో కొట్టడం తీవ్ర దుమారం రేపింది. దీంతో విమానాయాన సంస్థలు ఆయన తమ విమానాల్లో ప్రయాణించకుండా నిషేధం విధించాయి. ఈ క్రమంలో గైక్వాడ్ పలుసార్లు టిక్కెట్లు బుక్ చేసుకున్నా.. వాటిని ఎయిర్‌లైన్స్ రద్దుచేసి షాక్ ఇచ్చాయి. 
 
ఈ నేపథ్యంలో పార్లమెంట్‌లో గైక్వాడ్ వివరణ ఇచ్చారు. కానీ ఎయిరిండియా నిషేధంతో ఆ శాఖ మంత్రి అశోక్ గజపతి రాజుపై శివసేన ఎంపీలు దాడికి యత్నించారు. అలాగే దాడిపై పశ్చాత్తపం వ్యక్తం చేస్తూ గైక్వాడ్‌ లేఖ రాయడంతో దాడి వ్యవహారాన్ని ఇంతటితో ముగించాలనే ఉద్దేశంతో కేంద్రం ఉంది. దీంతో ఆయనపై ఎయిర్‌లైన్స్‌ విధించిన నిషేధం ఎత్తివేయవచ్చని సమాచారం. మరోవైపు ఏప్రిల్‌ 10లోగా గైక్వాడ్‌పై నిషేధం ఎత్తివేయాలని, లేదంటే ఎన్డీయే సమావేశాలను తాము బహిష్కరిస్తామని శివసేన హెచ్చరించింది.
 
ఈ నేపథ్యంలో గైక్వాడ్ మళ్లీ నోటికి పని చెప్పారు. శనివారం మీడియాతో మాట్లాడిన గైక్వాడ్.. పార్లమెంట్ గౌరవానికి భంగం వాటిల్లినందుకు మాత్రమే తాను క్షమాపణలు చెబుతున్నానని పేర్కొన్నారు. దీనికి తోడు ఎయిర్‌ఇండియా ఉద్యోగులు పిచ్చివాళ్లని అన్నారు. వారు వివాదాన్ని ప్రారంభిస్తే తాను ఎందుకు క్షమాపణలు చెప్పాలని రివర్సయ్యారు. మంత్రి అశోక్ గజపతిరాజు సూచన మేరకు గైక్వాడ్‌ పేరు ఎయిర్‌ ఇండియా తన నిషేధిత వ్యక్తుల జాబితా నుంచి తొలగించింది. మరుసటి రోజే గైక్వాడ్‌ ఇలాంటి వ్యాఖ్యలు చేయడంతో ఎయిరిండి సిబ్బంది షాక్ తిన్నారు. అంతేగాకుండా గైక్వాడ్ తీవ్రస్థాయిలో ఎయిరిండియా సిబ్బందిపై మాటల తూటాలు పేల్చారు. ఎయిరిండియా మేనేజర్ శివకుమార్ పిచ్చోడంటూ గైక్వాడ్ నోరుపారేసుకున్నారు. 
 
శివకుమార్‌కు గొడవలు కొత్తేం కాదని అన్నారు అతనిపై ఇలాంటి కేసులు 8 ఉన్నాయన్నారు. ఇదిలా ఉండగా, తృణమూల్ కాంగ్రెస్ పార్టీకి చెందిన రాజ్యసభ ఎంపీ డోలా సేన్ విమాన సిబ్బందితో గొడవకు దిగారన్న విషయాన్ని మరిచిపోకూడదని గైక్వాడ్ గుర్తు చేశారు.

వెబ్దునియా పై చదవండి