రీఫండ్ల విషయంలో బ్యాంకులు జాప్యం చేస్తే.. వినియోగదారుడికి నష్టపరిహారం కింద రోజుకు రూ.100 చెల్లించాలని తేల్చిచెప్పింది ఆర్బీఐ. ఏటీఎంల నుంచి నగదు ఉపసంహరణ, పాయింట్ ఆఫ్ సేల్ యంత్రాల దగ్గర కార్డుతో చెల్లింపులు, ఆన్లైన్లో నగదు బదిలీ సందర్భాల్లో.. లావాదేవీలు సక్రమంగా జరగకపోవడం ఇబ్బంది పెడుతోంది.
ఖాతాలో నగదు డెబిట్ అయినా ఏటీఎం నుంచి రాకపోవడం, ఆన్లైన్లో బదిలీ చేసినప్పుడు మన ఖాతాలో డబ్బు కట్ అయి అవతలి వ్యక్తికి జమ కాకపోవడం వంటి సమస్యలు ఇటీవలి కాలంలో ఎక్కువయ్యాయి. ఈ సమస్యలపై వినియోగదారుల నుంచి వెల్లువెత్తిన ఫిర్యాదులతో.. వాటి పరిష్కారానికి ఆర్బీఐ కచ్చితమైన మార్గదర్శకాలు జారీ చేసింది.
ఏటీఎం, కార్డ్ స్వైప్, కార్డు ద్వారా నగదు బదిలీ, ఐఎంపీఎస్, యూపీఐ, ఆధార్, నేషనల్ ఆటోమేటెడ్ క్లియరింగ్ హౌస్, వాలెట్స్ ద్వారా చెల్లింపులు చేసినప్పుడు.. మన ఖాతా నుంచి డబ్బు కట్ అయి అవతలి వ్యక్తి, సంస్థకు చేరకపోతే నిర్దిష్ట గడువులోగా మళ్లీ నగదు మన ఖాతాకు చేరాలి.
గడువు దాటితే.. వినియోగదారునికి రోజుకు రూ.100 చొప్పున జరిమానా చెల్లించాలని బ్యాంకులు, ఆర్థిక సంస్థలకు స్పష్టమైన ఆదేశాలు జారీ చేసింది. ఏ లావాదేవీ అయినా ఫెయిల్ అయినప్పుడు 1-5 రోజుల్లోపు ఆ మొత్తం తిరిగి ఖాతాదారునికి చేరాల్సిందేనని తేల్చిచెప్పింది.
కమ్యూనికేషన్ ఫెయిల్యూర్, నగదు లభ్యత లేకపోవడం, టైం అవుట్ సెషన్స్ లాంటి వైఫల్యాలను వినియోగదారులపై రుద్దకుండా ఆ బాధ్యతను బ్యాంకులే మోయాలని పేర్కొంది. దేశీయంగా జరిగే లావాదేవీలకు మాత్రమే ఈ మార్గదర్శకాలు వర్తిస్తాయని స్పష్టంచేసింది.