ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో దారుణం జరిగింది. భగత్ సింగ్ నాటకం కోసం రిహాల్స్ చేస్తుండగా జరిగిన అపశృతి కారణంగా ఓ బాలుడు ప్రాణాలు కోల్పోయాడు. 75వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకల కోసం భగత్ సింగ్ నాటకం ప్రదర్శించేందుకు యూపీలోని బదౌన్ జిల్లా బబత్ గ్రామంలో కొందరు విద్యార్థులంతా కలిసి రిహార్సల్ చేపట్టారు. భూరే సింగ్ కుమారుడైన శివరామ్ ఇతర పిల్లలతో కలిసి రిహార్సల్స్ చేస్తూ భగత్ సింగ్ ఉరితీత సీన్‌ను ప్రదర్శించేందుకు శివం తన మెడచుట్టూ ఉచ్చు బిగించుకున్నాడు.
తాను నిలుచున్న స్టూల్ పడిపోవడంతో ఉరిబిగుసుకుని బాలుడు మరణించాడని స్ధానికులు తెలిపారు. దీంతో భయానికి గురైన పిల్లలు సాయం కోసం కేకలు వేయగా అక్కడికి చేరుకున్న స్ధానికులు శివంను కిందకు దింపి ఉచ్చును తొలగించగా బాలుడు అప్పటికే మరణించాడు. బాలుడి మృతితో గ్రామంలో విషాదఛాయలు అలుముకున్నాయి. కేసు నమోదు చేసి దర్యాప్తు ముమ్మరం చేశామని జిల్లా ఎస్పీ సంకల్స్ శర్మ వెల్లడించారు.