ఢిల్లీలో వాయు కాలుష్యంపై సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి ఎన్.వి.రమణ, జస్టిస్ డి.వై. చంద్ర చూడ్, జస్టిస్ సూర్య కాంత్‌లతో కూడిన ధర్మాసనం అత్యవసర విచారణ చేపట్టింది. ఈ సందర్భంగా అరవింద్ కేజ్రీవాల్ ప్రభుత్వం న్యాయస్థానానికి ప్రమాణ పత్రం సమర్పించింది.
ఢిల్లీ, పరిసర ప్రాంతాల్లో కఠిన నిబంధనలను అమలు చేయాల్సి ఉంటుందని, లాక్డౌన్ అందుకు సరైనదని తెలిపింది. 'స్థానిక ఉద్గారాలను అదుపు చేసేందుకు సంపూర్ణ లాక్డౌన్ వంటి నిర్ణయాలు తీసుకోవడానికి దిల్లీ ప్రభుత్వం సిద్ధంగా ఉంది. దీంతోపాటు పక్కరాష్ట్రాల పరిధిలోని ఎన్‌సిఆర్ ప్రాంతంలో కూడా ఇలాంటి చర్యలే తీసుకొంటే ఫలితం మెరుగ్గా ఉంటుంది. ఈ చర్యలు తీసుకోవడానికి మేం సిద్ధం. ఎన్‌సిఆర్ పరిధిలో అమలు చేయాలని కేంద్రంగానీ, కమిషన్ ఫర్ ఎయిర్ క్వాలిటీ మేనేజ్‌మెంట్‌గానీ ఆదేశించాలి' అని ప్రమాణ పత్రంలో పేర్కొంది
అలాగే, కేంద్రం తరపున సొలిసిటర్ జనరల్ తుషార్ మెహతా వాదనలు వినిపిస్తూ వ్యవసాయ వ్యర్థాల దహనం వల్ల కేవలం 10శాతం మాత్రమే కాలుష్యం వస్తోందని కోర్టుకు వెల్లడించారు. కేంద్రం వాయుకాలుష్యాన్ని తగ్గించడానికి ఒక ప్రణాళికను న్యాయస్థానానికి అందజేసింది. దీనిలో స్టోన్ క్రషర్లను, కొన్ని రకాల విద్యత్తు కర్మాగారాలను నిలిపివేయడం, బహిరంగ ప్రదేశాల్లో చెత్తను దహనం చేయడాన్ని ఆపివేయడం వంటివి ఉన్నాయి. వీటిని అమలు చేస్తే కొంత ఫలితం ఉంటుందని సోలిసిటర్ జనరల్ కోర్టుకు వెల్లడించారు.
ఇకపోతే, ఢిల్లీ, కేంద్ర ప్రభుత్వం, పంజాబ్, హర్యానా, ఉత్తరప్రదేశ్ ఉద్యోగులకు వర్క్‌ఫ్రం హోం అవకాశాన్ని పరిశీలించాలని అత్యున్నత న్యాయస్థానం సూచిస్తూ.. కేంద్రం ఆధ్వర్యంలో రాష్ట్రాల చీఫ్ సెక్రటరీలు మంగళవారం భేటీ అయి తీసుకోవాల్సిన చర్యలపై చర్చించాలని పేర్కొంది. తదుపరి విచారణ నవంబర్ 17వ తేదీకి వాయిదా వేసింది.