విజయవాడ: ప్రపంచంలోనే పెద్దన్నగా ప్రసిద్ధి చెందిన దేశం అమెరికా. ఈ దేశానికి 45వ అధ్యక్షుడిగా ప్రముఖ రియల్టర్ డోనాల్డ్ ట్రంప్ విజయం సాధించాడు. అదే సమయంలో ఇండియాలో రియల్టర్ కుదేలు అయిపోయాడు. రూ. 500, రూ. 1000 నోట్లు ఆకస్మికంగా రాత్రికి రాత్రే రద్దు చేయటంతో ఇక్కడ మాత్రం రియల్ ఎస్టేట్ రంగం కుంగిపోయిందని ఆర్ధిక నిపుణులు విశ్లేషిస్తున్నారు. భూమిపై పెట్టే పెట్టుబడులు పదిలంగా పది రెట్లు అవుతాయని నమ్మిన వారున్న రియల్ రంగం ఇప్పట్లో కొలుకోలేదని భావిస్తున్నారు. దీని ప్రభావం ఎక్కువగా పెట్టుబడులు పెట్టే ఆంధ్రప్రదేశ్ పైన పడనుందని అంచనా వేస్తున్నారు.
కొత్తగా నిర్మించనున్న ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజధాని అమరావతి ప్రాంతంలో 29 గ్రామాల్లో రాజకీయ నాయకులు, రియల్టర్లు ఎక్కువగా పెట్టుబడులు పెట్టారు. పెద్దనోట్ల రద్దు ఇపుడు తీవ్ర ప్రభావాన్ని కలిగిస్తోంది. కోట్ల రూపాయల ఫ్లాట్లు, స్థలాలు ఇపుడు కొత్త నోట్లు ఇచ్చి కొనేవాళ్ళు ఎవరూ లేరు. పాత నోట్లు ఇచ్చినా అవి చెల్లవు. దీనితో మార్కెట్ అంతా నిల్ అయిపోయిందని రియల్టర్లు చెపుతున్నారు. బ్లాక్ మనీ బయటకు రాకపోవటంతో వాటిని నమ్ముకుని రియల్ రంగం ద్వారా గడించాలనుకున్న వారికి భారీ నిరాశ ఏర్పడింది.