రోహింగ్యా ముస్లింలు దేశంలోకి అక్రమంగా వచ్చిన వలసదారులని కేంద్రం పేర్కొంది. వారితో దేశ భద్రతకు ముప్పు ఉందని సుప్రీంకోర్టుకు తెలిపింది. ముఖ్యంగా, వీరిలో కొందరు పాకిస్థాన్ గూఢచార సంస్థ ఐఎస్‌ఐ, ఇస్లామిక్ స్టేట్ (ఐఎస్), లష్కరే వంటి ఉగ్రవాద సంస్థలు పన్నుతున్న కుట్రల్లో తమ వంతు సహకారం అందిస్తున్నారని పేర్కొంది.
అటువంటివారు దేశంలో నివసించడం జాతీయ భద్రతకు పెను ప్రమాదమని తెలిపింది. దేశంలో ఎక్కడైనా నివసించి, స్థిరపడే హక్కు ఈ దేశ పౌరులకే ఉంటుందని, చట్టవ్యతిరేకంగా వచ్చిన శరణార్థులకు ఉండదని స్పష్టంచేసింది. దేశంలో నివసించడం కోసం వారికి సుప్రీంకోర్టును ఆశ్రయించే హక్కు కూడా ఉండదని తేల్చి చెప్పింది.
రోహింగ్యాల అంశం ప్రభుత్వ విధానపరమైన నిర్ణయాల పరిధిలోకి వస్తుందని, అందువల్ల సుప్రీంకోర్టు జోక్యం చేసుకోరాదని కోరింది. ఈ మేరకు కేంద్రం సుప్రీంకోర్టుకు ఒక అఫిడవిట్‌ను సమర్పించింది. రోహింగ్యా ముస్లింలను దేశం నుంచి పంపివేయడాన్ని సవాలు చేస్తూ ఓ ప్రజా ప్రయోజన వ్యాజ్యం(పిల్) దాఖలైంది.