వివరాలలోకి వెళ్తే... కన్నడ హీరోయిన్ రాగిణీ ద్వివేది కోసం ఆమె ప్రస్తుత స్నేహితుడు, మాజీ స్నేహితుడు గొడవపడి దారుణంగా కొట్టుకోవడం జరిగింది. ఈ సంఘటన బెంగళూరులో జరగ్గా, సీసీ కెమెరాలు పరిశీలించిన పోలీసులు కేసు నమోదు చేసి శివప్రకాశ్ అనే వ్యక్తిని అరెస్ట్ చేశారు. బనశంకరి ప్రాంతంలోని రిట్జ్ కార్టన్ హోటల్‌లో ఈ ఘటన జరిగింది.
రాగిణి, తన ప్రస్తుత స్నేహితుడు, ఆర్టీఓ అధికారిగా ఉన్న రవి అనే వ్యక్తితో కలిసి హోటల్‌కు వెళ్లినప్పుడు, అప్పటికే అక్కడ ఉండిన ఆమె మాజీ స్నేహితుడు, బిజినెస్ మేన్ శివ ప్రకాశ్ తన మిత్రులతో కలిసి పార్టీ చేసుకుంటూండడం జరిగింది. రాగిణి అక్కడికి రవితో రావడం చూసిన శివప్రకాశ్ తనను వదిలేసి, మరొకడితో తిరుగుతున్నందుకు ఆమెతో వాగ్వాదానికి దిగాడు.
గొడవ అంతటితో ఆగకుండా శృతిమించి పక్కనే ఉన్న బీర్ బాటిల్ తీసుకుని రవిపై దాడి చేసాడు. హోటల్ సిబ్బంది వీరిని విడిపించి అక్కడి నుంచి పంపివేయగా, రాగిణి, రవిలు అశోక్‌నగర్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో శివ ప్రకాశ్ ను అదుపులోకి తీసుకున్న పోలీసులు కేసును విచారిస్తున్నామని వెల్లడించారు.
ఇదిలావుండగా, రాగిణి, రవి హోటల్‍కు వెళుతున్నప్పుడు, రవి భార్య ఆయనకు ఫోన్ చేసి గొడవ పడ్డట్టు తెలుస్తోంది. రాగిణి కోసం తన జీవితాన్ని నాశనం చేసావని వాపోతూ, ఇప్పుడు ఆమెతో కలిసి ఎక్కడున్నావో, ఎక్కడికి పోతున్నావో తెలుసునని, ఎవరో ఒకరు వచ్చి నిన్న చావగొడతారని శాపనార్థాలు కూడా పెట్టినట్టు సమాచారం. ఈ ఫోన్ కాల్ సంభాషణ జరిగిన కాసేపటికే రవిపై దాడి జరగడం ఇక్కడ గమనార్హం.