బ్యాంకులు ఇచ్చిన రుణాలను ఎగవేసి, విదేశాలకు పారిపోయిన వ్యాపారవేత్త విజయ్ మాల్యా ఆస్తులను వేలం వేయడానికి ముంబైలోని ప్రత్యేక మనీ లాండరింగ్ నిరోధక కోర్టు మార్గం సుగమం చేసింది. జప్తు చేసిన ఆస్తులను బ్యాంకులు వినియోగించుకునేందుకు అనుమతించింది. ముంబైలోని ప్రత్యేక కోర్టు ఈ మేరకు ఎస్బీఐ నేతృత్వంలోని 15 బ్యాంకుల కూటమికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది.
మాల్యాకు చెందిన ఆస్తులను ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ ఇదివరకే స్వాధీనం చేసుకుంది. వీటిని బ్యాంకులకు అప్పగించడం ద్వారా మాల్యా చెల్లించాల్సిన సొమ్మును ఈడీ రాబట్టుకోవచ్చంటూ కర్నాటక హైకోర్టు తీర్పు చెప్పింది. ఈ తీర్పుపై సుప్రీం కోర్టులో కేసు దాఖలైంది. కేసును విచారణ సందర్భంగా.. మాల్యా ఇప్పటి వరకు ఒక్క పైసా కూడా చెల్లించకపోవడాన్ని కోర్టు తీవ్రంగా పరిగణించింది. మాల్యాపై ఆగ్రహం వ్యక్తం చేసింది.