8న భారత్ బంద్ : కరోనా కట్టడి పేరుతో నోయిడాలో 144 సెక్షన్!

సోమవారం, 7 డిశెంబరు 2020 (08:41 IST)
కేంద్రం తీసుకొచ్చిన వివాదాస్పద వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా రైతు సంఘాలు ఈ నెల 8వ తేదీన భారత్ బంద్‍‌కు పిలుపునిచ్చాయి. ఈ బంద్‌కు అనేక రాజకీయ పార్టీలు సంపూర్ణ మద్దతు ప్రకటించాయి. 
 
అయితే, ఢిల్లీ సరిహద్దుల్లో రైతుల ఆందోళనల మధ్య గౌతమబుద్ధ నగర్‌(నోయిడా)లో సెక్షన్ 144 అమలు చేశారు. గౌతమబుద్ధ నగర్ పరిపాలనా విభాగం కరోనా మహమ్మారి కట్టడి పేరుతో సెక్టన్ 144ను అమలు చేసింది. ఇది డిసెంబరు ఆరో తేదీ నుంచి 2021, జనవరి 2 వరకూ కొనసాగనుంది. 
 
దీంతో గౌతమబుద్ధ నగర్‌లో ఎటువంటి సామూహిక కార్యక్రమాలు చేసేందుకు అవకాశం లేదు. రైతులు ఈనెల 8న భారత్ బంద్ తలపెట్టిన నేపథ్యంలో గౌతమబుద్ధ నగర్ పరిపాలనా అధికారులు అప్రమత్తమై, ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. 
 
డిసెంబరు 23న దివంగత మాజీ ప్రధాని చౌదరి చరణ్ సింగ్ జయంతి, 25న క్రిస్మస్, 31న సంవత్సరం చివరి రోజు, జనవరి 1న నూతన సంవత్సర వేడుకలు ఇలా పలు కార్యక్రమాలు ఉన్న దృష్ట్యా సామూహిక వేడుకలు నిర్వహిస్తుంటారు. అయితే కరోనా కాలంలో వీటిని నిర్వహించకుండా ఉండేందుకు పరిపాలనా అధికారులు ముందుగానే సెక్షన్ 144 విధించారు. 
 
ఇదిలావుంటే, గౌతంబుద్ధనగర్లో ఆదివారం 138 కరోనా కేసులు బయటపడ్డాయి. జిల్లాలో కరోనా కేసుల సంఖ్య 23,458కి పెరిగాయి. ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో కరోనా వైరస్ సంక్రమణ గొలుసును విచ్ఛిన్నం చేసేందుకు రాత్రి కర్ఫ్యూ విధించడంతో పాటు వివాహాలకు అతిథుల సంఖ్యను పరిమితం చేశారు. కరోనా కట్టడికి గత వారం యూపీలోని లక్నో, కాన్పూరు, ఘజియాబాద్, మీరట్, ఆగ్రా, గ్రేటర్ నోయిడా నగరాల్లో సర్కారు 144 సెక్షన్ విధించింది. 

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు