ముంబైలో విమానాలు ఎలా ఎగురుతాయో... దిగుతాయో మేం చూస్తాం : శివసేన ఎంపీల దాదాగిరి

గురువారం, 6 ఏప్రియల్ 2017 (13:56 IST)
లోక్‌సభ స్పీకర్‌ సుమిత్రా మహాజన్‌ సాక్షిగా శివసేన ఎంపీలు దాదాగిరి ప్రదర్శించారు. నిండు సభలోనే కేంద్ర పౌరవిమానయానశాఖమంత్రి అశోకగజపతి రాజుకు వార్నింగ్ ఇచ్చారు. తమ పార్టీకి చెందిన ఎంపీ రవీంద్ర గైక్వాడ్‌పై ఎయిరిండియా విధించిన నిషేధాన్ని ఎత్తివేయకుంటే ముంబై ఎయిర్‌పోర్టులో విమానాలు ఎలా ఎగురుతాయో.. దిగుతాయో తాము చూస్తామని హెచ్చరించారు. 
 
ప్రస్తుతం జరుగుతున్న పార్లమెంట్ సమావేశాల్లో భాగంగా రవీంద్ర గైక్వాడ్ అంశం గురువారం చర్చకు వచ్చింది. ఆ సమయంలో శివసేన ఎంపీలతో కలిసి ఆ పార్టీకి చెందిన కేంద్ర మంత్రి అనంత్ గీతె కేంద్ర పౌరవిమానాయాన శాఖామంత్రి అశోకగజపతి రాజుపై దాడికి యత్నించారు. ఈ దాడిని పలువురు కేంద్ర మంత్రులు అడ్డుకున్నారు. 
 
అంతటితో ఆగని శివసేన ఎంపీలు... స్పీకర్ పోడియంను చుట్టుముట్టి నినాదాలు చేశారు. రవీంద్ర గైక్వాడ్‌పై ఎయిరిండియా విధించిన నిషేధాన్ని ఎత్తివేయాలని డిమాండ్ చేశారు. లేనిపక్షంలో ముంబై విమానాశ్రయంలో విమానాలు ఎలా దిగుతాయో.. ఎగురుతాయో తామూ చూస్తామని స్పీకర్ సమక్షంలోనే హెచ్చరించడం గమనార్హం. అంటే లోక్‌సభ సాక్షిగా శివసేన ఎంపీలు దాదాగిరికి పాల్పడ్డారు. 

వెబ్దునియా పై చదవండి