ఇంట్లో తండ్రి శవం... తల్లిని బతికించుకునేందుకు క్యూలైన్లో కొడుకు.. ఎక్కడ?

ఆదివారం, 16 మే 2021 (09:26 IST)
ఆ కుటుంబ పెద్దలకు కరోనా సోకింది. ఈ వైరస్ మహమ్మారిబారినపడి ఇంటి పెద్ద కన్నుమూశాడు. ఆయన భార్య కూడా చావుబతుకుల మధ్య కొట్టుమిట్టాడుతుంది. ఒకవైపు, తండ్రిని కోల్పోయి తీవ్ర విషాదంలో ఉన్నప్పటికీ.. కొన ఊపిరితో పోరాడుతున్న తల్లిని రక్షించుకునేందుకు కుమారుడు రెమ్‌డెసివర్ మందుల కోసం క్యూలైన్లో నిల్చొనివుండటం ప్రతి ఒక్కరినీ కంటతడి పెట్టిస్తోంది. 
 
ఈ దృశ్యం చెన్నైలో కనిపిచింది. కరోనా రోగుల ప్రాణాలు రక్షించే రెమ్‌డెసివిర్ మందుల కొరత తమిళనాడు రాష్ట్ర వ్యాప్తంగా తీవ్రంగా వేధిస్తోంది. దీంతో రాష్ట్ర ప్రభుత్వమే రంగంలోకి దిగి ప్రత్యేక కౌంటర్ల ద్వారా విక్రయిస్తోంది. 
 
అయితే, ఈ మందులు కోసం కరోనా రోగుల బంధువులు ఎగబడటంతో కరోనా కట్టడి కోసం ప్రభుత్వం విధించిన అన్ని నియమనిబంధనలు గాలికెగిరిపోయాయి. స్థానిక జవహర్‌లాల్ నెహ్రూ స్టేడియంలో రెమ్‌డెసివిర్ ఇంజక్షన్ల కోసం జనాలు ఎగబడ్డారు. క్యూలో బారులు తీరారు. ఒకరినొకరు నెట్టుకుంటూ ఇంజక్షన్ సంపాదించుకునేందుకు తంటాలు పడుతున్నారు. 
 
తన తల్లిదండ్రులకు కరోనా సోకిందని, వైద్యుడు వారికి రెమ్‌డెసివిర్ ఇవ్వాలని చెప్పారని క్యూలో నిల్చున్న 30 ఏళ్ల సందీప్ రాజ్ చెప్పాడు. తాను గత 10 రోజులుగా వీటి కోసం ప్రయత్నిస్తున్నట్టు పేర్కొన్నాడు. సందీప్ ఆ ప్రయత్నాల్లో ఉండగానే ఈ ఉదయం అతడి తండ్రి మృతి చెందాడు. తండ్రి మృతదేహాన్ని ఇంట్లో పెట్టుకుని తల్లిని బతికించుకునేందుకు ఇక్కడికొచ్చి క్యూలో నిల్చున్నట్టు చెబుతూ కన్నీరు పెట్టుకున్నాడు. 
 
తనకు టోకెన్ ఉన్నా ఫలితం లేకుండా పోయిందన్నాడు. ఇక్కడ టోకెన్లు ఉన్నవారికి, లేనివారికి మధ్య ఎలాంటి తేడా లేదన్నాడు. ఈ పరిస్థితుల్లో ఏం చేయాలో తనకు అర్థం కావడం లేదని ఆవేదన వ్యక్తం చేశాడు. సందీప్‌లానే మరెంతో మంది స్టేడియానికి వచ్చి క్యూలో నిల్చున్నారు. కొందరు తెల్లవారుజామున ఒంటి గంటకే వచ్చి లైనులో నిల్చుంటున్నారు. 
 
అయితే, ఇక్కడ ఇంజక్షన్ సంపాదించి తమ వారిని కాపాడుకోవడం సంగతేమో కానీ, ఇక్కడికొచ్చిన వారు మాత్రం తప్పకుండా ఆ మహమ్మారి బారినపడడం ఖాయమని మరో యువకుడు చెప్పాడు. ఇలాంటి పరిస్థితుల్లో ఇప్పుడప్పుడే కరోనా అంతమవడం కష్టమని నిర్వేదం వ్యక్తం చేశాడు. స్టేడియంలో ఉన్న పోలీసులు కూడా వీరిని అదుపు చేయలేక చేతులెత్తేశారు. 

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు