మరో సర్జికల్ స్ట్రైక్స్ జరిగాయా? రాజ్‌నాథ్ సింగ్ మాటలకు అర్థం ఏమిటి?

శనివారం, 29 సెప్టెంబరు 2018 (10:48 IST)
కేంద్ర హోంశాఖ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ పాకిస్థాన్‌పై మరోసారి సర్జికల్ దాడులు జరిగినట్లు పరోక్షంగా వెల్లడించారు. ఏం జరిగిందో చెప్పలేను కానీ ఏదో ఒకటి మాత్రం జరిగిందని తెలిపారు. రెండు రోజుల క్రితమే ఆ వ్యవహారం కూడా సవ్యంగా జరిగిందని హోం మంత్రి పేర్కొన్నారు. ఈ విషయం ఇప్పటికి కొందరికే తెలుసునని.. అసలు ఏం జరిగిందో మరికొన్ని రోజుల్లో అందరికీ తెలుస్తుందని రాజ్ నాథ్ సింగ్ పేర్కొన్నారు. 
 
అలాగే పాకిస్థాన్‌పై రాజ్‌నాథ్ సింగ్ నిప్పులు చెరిగారు. తమ దేశం జోలికి రావొద్దని తీవ్రంగా హెచ్చరించారు. పాకిస్థాన్ మన పొరుగు దేశమని, వారిపై కాల్పులు జరపొద్దని సైన్యానికి తాను చెప్పినట్టు మంత్రి తెలిపారు. కానీ రెచ్చగొట్టే చర్యలకు పాల్పడితే భారత సైన్యం బుల్లెట్ల లెక్కను చూసుకోదని తీవ్రస్థాయిలో హెచ్చరికలు జారీ చేశారు. 
 
ఉత్తర్‌ప్రదేశ్‌లోని ముజఫర్‌నగర్‌లో ఓ కార్యక్రమంలో పాల్గొన్న రాజ్‌నాథ్ మాట్లాడుతూ.. పాకిస్థాన్ పూర్తిగా అశాంతితో ఉందని, అందుకే భారత్‌ను రెచ్చగొట్టే పనికిమాలిన చర్యలకు దిగుతోందని దుయ్యబట్టారు. కాగా రాజ్‌నాథ్ వ్యాఖ్యలను బట్టి చూస్తే.. మరోసారి సర్జికల్ స్ట్రైక్స్ జరిగినట్లు తెలుస్తోంది.

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు