భయం కరోనా వైరస్ కంటే చాలా డేంజర్ : సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్

మంగళవారం, 31 మార్చి 2020 (16:21 IST)
భయం కరోనా వైరస్ కంటే చాలా ప్రమాదకరమని సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి బాబ్డే అభిప్రాయపడ్డారు. కరోనా వైరస్ కారణంగా దేశ వ్యాప్తంగా లాక్‌డౌన్ ప్రకటించారు. దీంతో వేలాది మంది వలస కూలీలు ఉపాధిని కోల్పోయి తమతమ స్వస్థాలలకు బయలుదేరారు. అయితే, కరోనా వైరస్ సోకకుండా ఉండాలంటే భౌతిక దూరం పాటించాలన్న కారణంగా ఆయా రాష్ట్ర ప్రభుత్వాలు వారిని నిలువరించాయి. పైగా, ఎవరూ ఎక్కడికీ వెళ్లవద్దని ఆదేశిస్తూ, వారిని షెల్టర్ హోమ్స్‌కు తరలించిన నేపథ్యంలో, వారి బాగోగులపై దాఖలైన పిటిషన్‌ను విచారిస్తూ, సుప్రీంకోర్టు కీలక సూచనలు చేసింది.
 
"మీరు షెల్టర్ హోమ్స్‌కు తరలించిన ప్రతి ఒక్కరి బాధ్యతా మీదే. వారందరికీ పౌష్టికాహారం, వైద్య సదుపాయాలను సమకూర్చాలి" అంటూ కీలక సూచన చేసింది. అంతేకాకుండా, "వారిలోని భయాందోళనలు వైరస్ కన్నా ప్రమాదం. నిపుణులైన కౌన్సెలర్లతో వారికి కౌన్సెలింగ్ ఇప్పించాలి. వారంతా భజనలు, కీర్తనలు పాడుకోవచ్చు. నమాజ్ చేసుకోవచ్చు. వారికి మనోధైర్యాన్ని కలిగించే పనులను చేసుకోనివ్వండి. అయితే, ఒక్కొక్కరి మధ్యా భౌతిక దూరం తప్పనిసరి. వారివారి నమ్మకాలకు అనుగుణంగా షెల్టర్ హోమ్స్ లో వారికి ఆశ్రయం కల్పించాలి. తరచూ కమ్యూనిటీ లీడర్లు షెల్టర్ హోమ్స్ ను సందర్శిస్తూ, అక్కడున్న వారికి ధైర్యం చెప్పాలి" అని కేంద్ర ప్రభుత్వం తరపున హాజరైన సొలిసిటర్ జనరల్‌కు ప్రధాన న్యాయమూర్తి బాబ్డే సూచించారు. 

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు