పదోన్నతుల్లో కోటా పొందడం ప్రాథమిక హక్కు కాదు : సుప్రీంకోర్టు

సోమవారం, 10 ఫిబ్రవరి 2020 (15:06 IST)
దేశంలో మైనార్టీ, అణగారిన వర్గాలకు చెందిన వారికి కల్పించే పదోన్నతుల్లో రిజర్వేషన్లు పొందడం అనేది ప్రాథమిక హక్కు కాదని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. పైగా, ప్రభుత్వ ఉద్యోగ నియామకాలు, పదోన్నతుల్లో రిజర్వేషన్ల అమలు రాష్ట్రాల అభీష్టమని, కోటాకు కట్టుబడి ఉండాల్సిన అవసరం లేదంటూ సుప్రీంకోర్టు స్పష్టమైన తీర్పునిచ్చింది. 
 
పదోన్నతుల్లో కోటా పొందడం అనేది ప్రాథమిక హక్కు కాదని ఉత్తరాఖండ్‌ కేసులో శుక్రవారం తేల్చిచెప్పింది. రిజర్వేషన్లు కల్పించాలని తాము రాష్ట్ర ప్రభుత్వాలను ఆదేశించలేమని స్పష్టంచేసింది. ఈ తీర్పుపై కాంగ్రెస్‌తోపాటు లోక్‌జనశక్తి పార్టీ అసంతృప్తి వ్యక్తంచేశాయి. ఇది రిజర్వేషన్ల స్ఫూర్తికే విరుద్ధమని వ్యా ఖ్యానించాయి. 
 
ఆర్టికల్‌ 16(4), 14(4-ఏ) ప్రకారం ఎస్సీ, ఎస్టీలకు రిజర్వేషన్లు కల్పించడం ప్రభుత్వం విధి అని పేర్కొన్నారు. ఈ వాదనలను ప్రభుత్వం తరఫు న్యాయవాది తోసిపుచ్చారు. అనంతరం ధర్మాసనం స్పందిస్తూ, 'గతంలో మేము నిర్దేశించిన చట్టం ప్రకారం.. నిస్సందేహంగా రాష్ట్రాలు రిజర్వేషన్లకు కట్టుబడి ఉండాల్సిన అవసరం లేదు. అదేవిధంగా పదోన్నతుల్లో రిజర్వేషన్‌ ప్రాథమిక హక్కు అని ఏ ఒక్కరూ వాదించరాదు అని స్పష్టం చేసింది. 
 
అంతేకాకుండా రాష్ట్ర ప్రభుత్వాలు రిజర్వేషన్లు కల్పించాలంటూ కోర్టు ఆదేశాలు (మాండమస్‌) జారీ చేయజాలదని చెప్పింది. ఉత్తరాఖండ్‌ హైకోర్టు తీర్పును తప్పుబట్టింది. ప్రభుత్వ ఉద్యోగాల్లో రిజర్వేషన్లు అమలుచేయాలని రాష్ట్ర ప్రభుత్వాలను ఆదేశించరాదని చట్టంలో స్పష్టంగా ఉన్నది అని ధర్మాసనం పేర్కొంది. 

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు