శబరిమల ఆలయంలోకి అన్ని వయస్కులైన మహిళలను అనుమతిస్తూ ఇచ్చిన తీర్పును సుప్రీం కోర్టు విస్తృత ధర్మాసనం రిజర్వ్‌లో వుంచింది. ఈ మేరకు అన్ని వయస్కులైన మహిళలను శబరిమల ఆలయంలోకి అనుమతించే తీర్పుపై సమీక్ష సందర్భంగా ఐదుగురు సభ్యుల ధర్మాసనం... మత వ్యవహారాలకు సంబంధించిన కొన్ని అంశాలను విస్తృత ధర్మాసనం పరిశీలిస్తుందని చెప్పింది.
ట్రావెన్ కోర్ బోర్డు తరఫున సీనియర్ న్యాయవాది రాకేశ్ ద్వివేది వాదనలు వినిపించారు. మతాచారాలు అందరికీ సమానంగా ఉంటాయని ఆర్టికల్ 25(1) చెబుతోంది. జీవ సంబంధిత లక్షణాల కారణంగా మహిళలపై వివక్ష చూపించడం సరికాదు. శబరిమల అంశంలో న్యాయస్థానం తీర్పును అంగీకరిస్తున్నామన్నారు. అయితే రుతుక్రమ వయసు మహిళలను శబరిమల ఆలయంలోకి అనుమతించమని ట్రావెన్‌కోర్ బోర్డ్ గతంలో పలుమార్లు చెప్పిన విషయం తెలిసిందే. తాజాగా మహిళల ప్రవేశంపై బోర్డు తన వైఖరి మార్చుకోవడం గమనార్హం.
అంతకుముందు నాయర్ సర్వీస్ సొసైటీ, కేరళ ప్రభుత్వం కూడా తమ వాదనలు వినిపించింది. శబరిమల తీర్పును పునఃసమీక్ష చేపట్టాల్సిన అవసరం లేదని, దీనిపై దాఖలైన రివ్వూ పిటిషన్లను కొట్టివేయాలని కేరళ ప్రభుత్వం న్యాయస్థానాన్ని కోరింది. అన్నిపక్షాల వాదనలు విన్న అనంతరం తీర్పును రిజర్వ్‌లో పెడుతున్నట్లు ధర్మాసనం వెల్లడించింది.