వ్యభిచారం ఓ వృత్తి.. నేరం కాదు... కానీ బ్రోతల్ హౌస్ నడపడం నేరమే : సుప్రీంకోర్టు

శుక్రవారం, 27 మే 2022 (08:38 IST)
వ్యభిచార వృత్తిపై సుప్రీంకోర్టు సంచలన వ్యాఖ్యలు చేసింది. వ్యభిచారం నేరంకాదని స్పష్టం చేసింది. పైగా, వ్యభిచారం ఓ వృత్తి అని, అందులో పోలీసులు జోక్యం చేసుకోలేరని స్పష్టం చేసింది. అయితే, వ్యభిచార గృహాలు నడపడం మాత్రం నేరమేని వ్యాఖ్యానించింది. ఈ మేరకు జస్టిస్ ఎల్. నాగేశ్వర రావు నేతృత్వంలోని త్రిసభ్య ధర్మాసనం విచారణలో సెక్స్ వర్కర్ల హక్కులకు భద్రత కలిగించేలా ఆరు అంశాల్లో కీలక ఆదేశాలు జారీచేసింది. 
 
త్రిసభ్య ధర్మాసనం జారీ చేసిన ఆదేశాల్లో సెక్స్ వర్కర్లు కూడా చట్టం యొక్క సమాన రక్షణకు అర్హులుగా పరిగణించాలని సూచించింది. అన్ని కేసుల్లో వయసు, సమ్మతి ఆధారంగా క్రిమినర్ చట్టాన్ని సమానంగా వర్తింజేయాలని సూచించింది. 
 
ఓ సెక్స్ వర్కర్ మేజర్ అయివుండి, ఇష్టపూర్వకంగా వ్యభిచార వృత్తిలో కొనసాగితే పోలీసులు జోక్యం చేసుకోజాలరని స్పష్టం చేసింది. ఇలాంటి వ్యావహారాల్లో పోలీసుల ఎలాంటి క్రిమినల్ యాక్షన్ తీసుకోరాదని పేర్కొంది. 
 
భారత రాజ్యాంగంలోని ఆర్టికల్ 21 ప్రకారం ఈ దేశంలోని ప్రతి ఒక్కరికీ గౌరవప్రదంగా జీవించే హక్కు ఉంది. అందుకు వృత్తితో సంబంధం లేదని పేర్కొంది. సెక్స్ వర్కర్లను అరెస్టు చేయడంగానీ, వారిపై జరిమానా వేయడం కానీ, వారిని వేధించడం కానీ చేయరాదని పేర్కొంది. ఎందుకంటే స్వచ్ఛంధంగా వ్యభిచారం చేయడం నేరమేమీ కాదని, వ్యభిచార గృహం నిర్వహించడం ఒక్కటే నేరమని పేర్కొంది. 
 
అలాగే, తల్లి వ్యభిచారి అయినంతమాత్రాన ఆమె నుంచి బిడ్డను వేరుచేయరాదు. కనీస మానవీయ కోణంలో ఆమెకు, ఆమె బిడ్డలకు భద్రత కల్పించాలి. ఒకవేళ మైనర్లు సెక్స్‌ వర్కర్లతో కనిసి నివసిస్తుంటే వారిని అక్రమ రవాణా చేసినట్టుగా భావించరాదని ధర్మాసనం అభిప్రాయపడింది. 
 
అంతేకాకుండా, సెక్స్ వర్కర్లు ఏదైనా అంశంలో ఫిర్యాదు చేయడానికి స్టేషన్‌కు వస్తే వారి పట్ల పోలీసులు విపక్ష లేదా దురుసుగా ప్రవర్తించరాదని తెలిపింది. వ్యభిచారం నేపథ్యంలో వారిపై ఏదేని దాడులు జరిగినపుడు ఎట్టి పరిస్థితుల్లోనూ ఫిర్యాదు స్వీకరణ నిరాకరించదని కోర్టు స్పష్టం చేసింది. అంతేకాకుండా, ఓ సెక్స్ వర్కర్ వద్ద కండోమ్స్ ఉండటాన్ని ఆమె నేరం చేసిందనడానికి ఆధారాలుగా పోలీసుల భావించరాదని సుప్రీంకోర్టు నిర్ధేశించింది. 
 
ఏదేనీ సందర్భాల్లో సెక్స్ వర్కర్ల పేర్లను బయటికి వెల్లడించకుండా మీడియా అత్యంత జాగ్రత్త వహించాలని స్పష్టం చేసింది. రెయిడ్లు, అరెస్టులు, రెస్క్యూ ఆపరేషన్లు సందర్భంగా వారు బాధితులైనా, ఆరోపణలు ఎదుర్కొంటున్న వారైనా పేర్లను మాత్రం బహిర్గతం చేయరాదని ఆదేశించింది. వారి ఫొటోలను ప్రచురించడం కానీ, టీవీల్లో ప్రసారం చేయడం కానీ చేయరాదని వెల్లడిస్తూ ఈ కేసులో కేంద్రం తన వాదనను వినిపించాలని కోరుతూ తదుపరి విచారణను జూలై 27వ తేదీకి వాయిదా వేసింది. 

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు