మోడీకి అంత తెలివెక్కడుంది.. సర్జికల్ స్ట్రైక్స్ సలహా ఇచ్చింది మా నేత.. యూపీలో ఎస్పీ నేత పోస్టర్లు

ఆదివారం, 9 అక్టోబరు 2016 (15:13 IST)
పాక్ ఆక్రమిత కాశ్మీర్‌లోని ఉగ్రవాద శిబిరాలపై భారత ఆర్మీ జరిపిన సర్జికల్ స్ట్రైక్స్‌పై ఇపుడు దేశ వ్యాప్తంగా చర్చ జరుగుతోంది. ఈ తరహా దాడులు జరిపింది తామేనని బీజేపీ నేతలు అంటుంటే.. అసలు ఈ దాడులే జరగలేదని, జరిగివుంటే ఆధారాలు బయటపెట్టాలంటూ కాంగ్రెస్ నేతలు డిమాండ్ చేస్తున్నారు. 
 
ఈ పరిస్థితుల్లో ఉత్తరప్రదేశ్ రాష్ట్ర అధికార సమాజ్‌వాదీ పార్టీ నేతలు మాత్రం మరోలా స్పందిస్తున్నారు. అసలు ఈ తరహా దాడులు జరపాలంటూ ప్రధానమంత్రి నరేంద్ర మోడీకి సలహా ఇచ్చింది తామేనని పేర్కొంటూ పోస్టర్లు అంటించారు. 
 
'పాక్ ఆక్రమిత కాశ్మీర్‌లో సర్జికల్ స్ట్రైక్స్ ఐడియా ఇచ్చింది మన నేతాజీ ములాయం సింగ్ యాదవ్. ఆయన సలహా తీసుకున్న తర్వాతే ప్రధాని నరేంద్ర మోడీ దాడులకు పచ్చజెండా ఊపారు. ఆర్మీ ఆపరేషన్‌పై కొందరు రాజకీయాలు చేస్తున్నారు. అలాంటివాళ్లంతా జీరోలు.. ఆర్మీ జవాన్లే అసలైన హీరోలు..' అంటూ ఎస్పీ యువనేత మొహమ్మద్ షంషేర్ మాలిక్ రాత్రికిరాత్రే ముజఫర్ నగర్‌లో పోస్టర్లు వేయించాడు. 
 
అయితే సమాజ్ వాది పార్టీ ముజఫర్ నగర్ జిల్లా అధ్యక్షుడు శ్యామ్ లాల్ సైనీ మాత్రం మాలిక్ వ్యాఖ్యలను ఖండించారు. 'సర్జికల్ స్ట్రైక్స్ ఐడియా ములాయం సింగ్‌దే అని నేను గానీ, పార్టీ పెద్దలుగానీ ఎక్కడా చెప్పలేదు. మా నేతాజీ అనుభవజ్ఞుడు గనుక ఆయన సలహా తీసుకొని ఉంటారని మాత్రమే అనుకున్నాం' అని శ్యామ్ లాల్ వివరణ ఇచ్చారు. 

వెబ్దునియా పై చదవండి