తమిళనాడు మంత్రివర్గంలో మార్పు.. ఆర్థిక శాఖ నుంచి పళనివేల్ తొలగింపు

శుక్రవారం, 12 మే 2023 (14:06 IST)
తమిళనాడు ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్ తన మంత్రివర్గాన్ని పునర్‌వ్యవస్థీకరించారు. ముస్లిం సామాజికి వర్గానికి చెందిన ఆవడి నాజర్‌ను మంత్రి పదవి నుంచి తప్పించారు. ఆయన స్థానంలో పార్టీ సీనియర్ నేత, డీఎంకే కోశాధికారి, లోక్‌సభ సభ్యుడు టీఆర్ బాలు తనయుడు టీఆర్‌బి రాజాకు మంత్రివర్గంలో చోటు కల్పించారు. అదేవిధంగా ఆర్థిక శాఖామంత్రిగా ఉన్న పళనివేళ్ త్యాగరాజ్‌ను ఆ శాఖ నుంచి తప్పించి, ఐటీ శాఖను కేటాయించారు. ఆయన స్థానంలో మంత్రి తంగం తెన్నరుసు ఆ బాధ్యతలు అప్పగించారు. తమిళనాట ఆడియో టేపుల వ్యవహారం బయటకొచ్చిన నేపథ్యంలో ఈ పరిణామం చోటుచేసుకోవడం ప్రాధాన్యం సంతరించుకుంది.
 
కాగా, గత 2021లో ఆర్థిక మంత్రిగా బాధ్యతలు చేపట్టిన త్యాగరాజన్‌ ఆర్థిక మంత్రిగా తనదైన ముద్రవేశారు. కేంద్రంపై విమర్శలు చేయడం ద్వారా గుర్తింపు పొందారు. అయితే, మేనిఫెస్టోలో పేర్కొన్న పాత పెన్షన్‌ విధానం గురించి త్యాగరాజన్‌ సుముఖంగా లేకపోవడం పట్ల ప్రభుత్వ ఉద్యోగుల నుంచి ఆయనపై వ్యతిరేకత ఉంది. 
 
కార్పొరేట్‌ తరహా ఆర్థిక విధానాలను ఆయన అవలంభిస్తున్నారంటూ ఆరోపించారు. మరోవైపు ఓ వర్గం పార్టీ నేతలు సైతం ఆయనపై అసంతృప్తిగా ఉన్నారు. ఈ నేపథ్యంలో భాజపా తమిళనాడు శాఖ అధ్యక్షుడు అన్నామలై బహిర్గం చేసిన ఆడియో టేపుల వ్యవహారం ఆయనను ఇరుకున పెట్టింది. డీఎంకేకు చెందిన కీలక నేతల ఆస్తుల గురించి త్యాగరాజన్‌ మాట్లాడినట్లుగా అందులో ఉంది. ఆ సంభాషణలు తనవి కావని త్యాగరాజన్‌ ఖండించారు.
 
ఈ నేపథ్యంలో స్టాలిన్‌ తన మంత్రివర్గంలో మార్పులు చేశారు. పరిశ్రమల శాఖ మంత్రిగా ఉన్న తంగం తెన్నరసుకు కీలకమైన ఆర్థిక శాఖను అప్పగించారు. త్యాగరాజన్‌కు ఐటీ శాఖ అప్పగించిన స్టాలిన్‌.. ప్రస్తుత ఐటీ శాఖ మంత్రి మనో తంగరాజ్‌ను మిల్క్‌, డెయిరీ డెవలప్‌మెంట్‌ డిపార్ట్‌మెంట్‌కు మార్చారు. 
 
ఆ స్థానంలో ఉన్న ఎస్‌ఎం నాసర్‌ను కేబినెట్‌ నుంచి తప్పించారు. కొత్తగా టీఆర్‌బీ రాజాను మంత్రి వర్గంలోకి తీసుకుని పరిశ్రమల శాఖ అప్పగించారు. ఎంపీ సామినాథన్‌కు ఇన్ఫర్మేషన్‌, పబ్లిసిటీ శాఖతో పాటు తమిళ్‌ డెవలప్‌మెంట్‌ శాఖను సైతం కేటాయించారు. మంత్రులంతా గురువారం ఉదయం రాజ్‌భవన్‌లో ప్రమాణ స్వీకారం చేశారు.

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు