తమిళనాడు రాష్ట్ర ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్ ఆస్పత్రిలో చేరారు. రెండు రోజుల క్రితం ఆయనకు కరోనా వైరస్ సోకినట్టు నిర్దారణ అయిన విషయం తెల్సిందే. వైద్యుల సూచన మేరకు ఆయన హోం క్వారంటైన్‌లో ఉంటూ చికిత్స పొందుతూ వచ్చారు. అయితే, గురువారం ఉదయం ఆయన చెన్నైలోని ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో చేరారు. ఆయనను ప్రత్యేక వైద్యుల బృందం పర్యవేక్షిస్తూ, చికిత్స అందిస్తుంది.
కాగా, తనకు కరోనా సోకినట్టు సీఎం స్టాలిన్ మంగళవారం ప్రకటించిన విషయం తెల్సిందే. "ఈ రోజు కాస్త అలసటగా అనిపించింది. పరీక్షలు చేయిస్తే.. కరోనా పాజిటివ్ అని తేలింది. నేను ఐసోలేషన్లోకి వెళ్లాను. ప్రజలందరూ మాస్కులు ధరించాలి. టీకాలు వేయించుకోవాలి. ఇతర జాగ్రత్తలన్నీ తీసుకోవాలి" అంటూ ట్వీట్ చేశారు.