ఉమ్మడి పౌర స్మృతికి పూర్తి వ్యతిరేకం : సీఎం స్టాలిన్

శుక్రవారం, 14 జులై 2023 (15:55 IST)
భిన్నత్వంలో ఏకత్వానికి మారుపేరుగా ఉంటున్న వసుదైక భారతదేశంలో ఉమ్మడి పౌరస్మృతి చట్టం అమలు దిశగా చర్యలు చేపట్టడం గర్హనీయమని తమిళనాడు ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్ అన్నారు. ఆ చట్టాన్ని తమిళనాడు ప్రభుత్వం తీవ్రంగా వ్యతిరేకిస్తోందంటూ లా కమిషన్ ఛైర్మన్ జస్టిస్ రీతురాజ్ అవస్థికి ఆయన ఓ లేఖ రాశారు. అందరికీ భద్రత, సెక్యులరిజమ్ అనే పునాదులపైనే రాజ్యాంగ ధర్మాసనం రూపొందించారని, సెక్షన్ 25 ప్రకారం ఓ వ్యక్తి తనకు నచ్చిన మతాన్ని స్వీకరించేందుకు, ఆ మతాన్ని వ్యాప్తి చేసేందుకు వీలు కల్పిస్తోందన్నారు. 
 
ఆయా వర్గాలు, మతాలకు సంబంధించిన చట్టాలు మత నియమావళిననుసరించే ఉన్నాయని, అటువంటి చట్టాలు ఆయా మతాల ఆమోదం లేకుండా ఎలాంటి మార్పులూ చేయలేమనే విషయాన్ని పరిగణనలోకి తీసుకోవాలని సూచించారు. ఒకే మతానికి చెందిన వారిలోనూ ప్రాంతాలవారీగా తారతమ్యాలు ఉన్నాయని, వారి నుండి ఏకాభిప్రాయాన్ని సాధించి ఈ పౌరస్మృతి చట్టాన్ని అమలు చేయడానికి వీలుపడదని గుర్తుచేశారు. 
 
ఈ చట్టాన్ని అత్యవసరంగా ప్రవేశపెట్టడం రాజ్యాంగ నిబంధనలకు విరుద్ధమేకాకుండా, దేశంలో మతపరమైన అనైక్యత, గందరగోళానికి దారితీస్తుందని హెచ్చరించారు. సంస్కృతీ సంప్రదాయాలపరంగా వైవిధ్యం కలిగి.. భిన్నత్వంలో ఏకత్వానికి ప్రతీకగా ఉన్న భారతదేశంలో ఉమ్మడి పౌరస్మృతి చట్టాన్ని అమలు చేస్తే దేశ బహుముఖత్వానికి విఘాతం ఏర్పడుతుందని ఆందోళన వ్యక్తం చేశారు. ఈ చట్టాన్ని అమలు చేసే ఏ ప్రయత్నమైనా మతపరమైన విషయాలలో పాలకులు జోక్యం చేసుకునేందుకే దోహదపడుతుందని, భవిష్యత్‌లో వ్యక్తిగత స్వేచ్ఛకు పెనుముప్పు కలిగిస్తుందని స్టాలిన్ తన లేఖలో పేర్కొన్నారు.

వెబ్దునియా పై చదవండి