లాక్‌డౌన్ పొడిగింపు : తమిళనాడులోని ఆ జిల్లాల్లో లాక్డౌన్ ఆంక్షలు

శనివారం, 5 జూన్ 2021 (14:37 IST)
దేశంలో కరోనా వైరస్ పాజిటివ్ కేసులు అధిక సంఖ్యలో నమోదవుతున్న రాష్ట్రాల్లో తమిళనాడు ఒకటి. ఈ రాష్ట్రంలో ప్రస్తుతం రోజుకు 22 వేలకు పైగా కేసులు నమోదవుతున్నాయి. ఈ నేపథ్యంలో రాష్ట్రంలో మరో వారం రోజుల పాటు లాక్‌డౌన్‌ను ప్రభుత్వం పొడగించింది. 
 
ప్రస్తుతం కొనసాగుతున్న లాక్డౌన్‌ ఈ నెల 7న ఉదయం 6 గంటలతో ముగియనుంది. ప్రస్తుతం వైరస్‌ ఉధృతి కొనసాగుతున్న నేపథ్యంలో 14వ తేదీ ఉదయం 6 గంటల వరకు పొడగిస్తూ సీఎం ఎంకే స్టాలిన్‌ ఆదేశాలు జారీ చేశారు. 
 
వైరస్‌ వ్యాప్తి తక్కువ ఉన్న పలు జిల్లాలకు సడలింపులను ప్రకటించారు. షాపింగ్‌ కాంప్లెక్స్‌, మాల్స్‌, పర్యాటక ప్రదేశాలు, సినిమా థియేటర్‌, సెలూన్ షాపులు రాష్ట్రవ్యాప్తంగా మూసి ఉంచనున్నారు. 
 
కోయంబత్తూర్‌, నీలగిరి, తిరుప్పూర్‌, ఈరోడ్‌, సేలం, కరూర్‌, నమక్కల్‌, తంజావూర్‌, తిరువారూర్‌, నాగపట్నం, మైలాడుదురై జిల్లాల్లో కరోనా కేసులు అధికంగా ఉండడంతో ప్రభుత్వం ఆంక్షలు విధించింది.
 
11 జిల్లాలు మినహా రాష్ట్రవ్యాప్తంగా సడలింపులుంటాయని ప్రభుత్వం తెలిపింది. కిరాణ దుకాణాలు, చేపలు, మాంసం, కూరగాయలు, పండ్లు, పూల దుకాణాలు ఉదయం 6 గంటల నుంచి 5 గంటల మధ్య తెరిచేందుకు అనుమతి ఇచ్చింది. 
 
అన్ని ప్రభుత్వ కార్యాలయాలు 30 శాతం సిబ్బందితో పని చేయనున్నాయి. తక్కువ కేసులు నమోదవుతున్న జిల్లాల్లో రిజిస్ట్రేషన్‌ కార్యాలయాలు పని చేస్తాయని, టోకెన్లలో 50 శాతం మాత్రమే జారీ చేస్తారని చెప్పారు. అపార్ట్‌మెంట్ల కోసం ప్రైవేటు సెక్యూరిటీ ఏజెన్సీలు, హౌస్‌ కీపింగ్‌ సేవలను ఈ రిజిస్ట్రేషన్‌తో అనుమతి ఇవ్వనున్నట్లు చెప్పారు.
 
ప్లంబర్లు, ఎలక్ట్రీషియన్లు, కంప్యూటర్‌, మోటారు టెక్నీషియన్లు, వడ్రండుగులు ఈ రిజిస్ట్రేషన్‌తో ఉదయం 6 నుంచి సాయంత్రం 5 గంటల వరకు పని చేసుకోవచ్చు. ఎలక్ట్రికల్ వస్తువులు విక్రయించే దుకాణాలు, ద్విచక్ర వాహన వర్క్‌షాప్‌లు, హార్డ్‌వేర్ షాపులు, స్టేషనరీ దుకాణాలు, ట్రావెల్ ఆపరేటర్ల వాహన మరమ్మతు దుకాణాలు సాయంత్రం వరకు నిర్వహించుకునేందుకు ప్రభుత్వం అనుమతి ఇచ్చింది. 
 
అలాగే ఆటోలు, క్యాబ్‌లో ఇద్దరు ప్రయాణికులు ప్రయాణించేందుకు అనుమతి ఇవ్వడంతో పాటు ఇంకా పలు సడలింపులు ఇచ్చింది. అయితే, కొవిడ్‌ నిబంధనలు పాటించాలని స్పష్టం చేసింది. అదేసమయంలో రాష్ట్ర వ్యాప్తంగా సమాజిక భౌతిక దూరం పాటిస్తూ, మాస్కులు ధరిస్తూ ప్రజలు స్వీయ రక్షణ చర్యలు పాటించాలని కోరింది. 

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు