అకస్మాత్తుగా డీఎంకే బలం రెట్టింపు కావడం వెనుక ఒక వ్యక్తి, ఒక సంస్థ ఉందన్న వాదన రోజు రోజుకు బలపడుతోంది. ఆయనే ప్రశాంత్ కిషోర్. ఆ సంస్థే.. ఆయన నిర్వహించే ఐ ప్యాక్. దాదాపు రెండేళ్ల క్రితం ఆ సంస్థతో డీఎంకే ఒక ఒప్పందం కుదుర్చుకుంది.
తమిళనాడులో తమ పార్టీ ఎన్నికల వ్యూహాన్ని రూపొందించే బాధ్యతను ప్రశాంత కిషోర్ (పీకే)పై పెట్టింది. తొలి దశలో తమిళనాడు పరిస్థితులను డీఎంకే బలాలు, బలహీనతలు అంచనా వేసిన పీకే బృందం వ్యూహాలకు పదునుపెట్టింది. ఎన్నికల నాటికి డీఎంకే బలమైన శక్తిగా తీర్చిదిద్దడంలో విజయం సాధించింది.
ఏడాదిగా స్టాలిన్ ఇమేజ్‌ను పెంచడంలో ఐ ప్యాక్ పాత్రను చాలానే వుంది. ప్రజలను ఆకర్షించే విధంగా పోస్టర్లు, బ్యానర్లు రూపొందించారు. డీఎంకే అధ్యక్షుడు స్టాలిన్‌కు అర్జీలు పెట్టుకోవాలనుకున్నవారి కోసం అక్కడక్కడ బాక్సులు ఏర్పాటు చేస్తే జనం వాటిలో తమ వినతులు వేశారు. అధికారంలోకి వచ్చిన వెంటనే ఈ సమస్యలన్నీ పరిష్కరిస్తామని స్టాలిన్ హామీ ఇచ్చారు.