ఐదేళ్ళలో రూ.62 కోట్లు పెరిగిన జయలలిత ఆస్తులు.. ఎలా?

శనివారం, 14 మే 2016 (13:25 IST)
తమిళనాడు ముఖ్యమంత్రి, అన్నాడీఎంకే అధినేత్రి జయలలిత ఆస్తులు ఐదేళ్ళలో 62 కోట్ల రూపాయల మేరకు పెరిగాయి. ఈ విషయం అసోసియేషన్ ఫర్ డెమోక్రటిక్ రిఫార్మ్స్ (ఏడీఆర్) చేపట్టిన ఓ సర్వేలో వెల్లడైంది. అంతేకాకుండా, 2011 నుంచి 2016 మధ్యకాలంలో ఎమ్మెల్యేగా ఉండి, ఈనెల 16వ తేదీన జరిగే అసెంబ్లీ ఎన్నికల్లో మళ్లీ పోటీస్తున్న 89 మంది ఎమ్మెల్యేల ఆస్తులు రెట్టింపు అయినట్టు పేర్కొంది. 
 
ఈ ఎమ్మెల్యేల ఆస్తి గత 2011 ఎన్నికల సమయంలో 4.35 కోట్ల రూపాయలుగా ఉండగా, 2016లో ఇవి రూ.8.63 కోట్లకు చేరుకున్నాయి. అలాగే, ముఖ్యమంత్రి జయలలిత ఆస్తులు ఏకంగా 62 కోట్ల రూపాయల మేరకు పెరిగాయి. గత 2011లో ఆమె ఆస్తులు విలువ రూ.51 కోట్లుగా ఉండగా 2016లో ఇవి రూ.113 కోట్లకు చేరుకున్నట్టు ఏడీఆర్ నివేదిక వెల్లడించింది. 
 
అదేవిధంగా మాజీ ముఖ్యమంత్రి ఎం కరుణానిధి ఆస్తులు రూ.18 కోట్ల మేరకు పెరిగాయి. గత 2011లో రూ.44 కోట్లుగా ఉండగా, ఇపుడు ఇవి రూ.62 కోట్లకు చేరుకున్నాయి. ఇకపోతే సాధారణ ఎమ్మెల్యేగా ఉన్న సినీ నటుడు ఆర్.శరత్ కుమార్ ఆస్తులు 2011లో రూ.27 కోట్లుగా ఉండగా, 2016 నాటికి రూ.64 కోట్లకు చేరుకున్నాయి. అంటే ఈ హీరో ఆస్తుల పెరుగుదల రూ.36 కోట్లుగా ఉంది. 
 
ఈ ఎన్నికల్లో రెండోసారి 89 మంది ఎమ్మెల్యేలు పోటీ చేస్తుండగా, వీరిలో 51 మంది ఎమ్మెల్యేల ఆస్తులు సగటున రూ.4 కోట్ల మేరకు పెరిగినట్టు ఏడీఆర్ సర్వేలో తేలింది. వీరిలో 16 మంది డీఎంకే ఎమ్మెల్యేలు ఉండగా, వీరి సగటు ఆస్తి పెరుగుదల మాత్రం రూ.5 కోట్లుగా ఉంది. మరో ప్రధాన పార్టీ అయిన డీఎండీకే ఎమ్మెల్యేల్లో 11 మంది ప్రజాప్రతినిధుల ఆస్తుల పెరుగుదల సగటున రూ.2 కోట్లుగా ఉంది. నలుగు సీపీఐ ఎమ్మెల్యేల ఆస్తుల పెరుగుదల రూ.27 లక్షలు కాగా, నలుగురు సీపీఎం ఎమ్మెల్యేల ఆస్తుల పెరుగుదల రూ.15 లక్షలుగా ఉందని తెలిపింది. ఒక కాంగ్రెస్ ఎమ్మెల్యే ఆస్తి పెరుగుదల రూ.3 కోట్లుగానూ, ఇద్దరు పీఎంకే ఎమ్మెల్యేల ఆస్తి పెరుగుదల రూ.కోటిగా ఉంది. 

వెబ్దునియా పై చదవండి