అత్యవసర పరిస్థితుల్లో ప్రయాణానికి అందుబాటులో ఉండే రైలు టిక్కెట్లు తత్కాల్. ఇందులో తత్కాల్, ప్రీమియర్ తత్కాల్ అనే రెండు రకాలైన టిక్కెట్లు ప్రయాణికులకు అందుబాటులో ఉంటాయి. తత్కాల్ టిక్కెట్ల ధర సాధారణ టిక్కెట్ల కంటే కాస్త ఎక్కువగాను, ప్రీమియం తత్కాల్ టిక్కెట్ల ధరలు మరింత ఎక్కువగా ఉంటాయి. ఈ టిక్కెట్లను ప్రయాణానికి ఒక రోజు ముందు మాత్రమే రిజర్వు చేసుకునే వెసులుబాటు ఉంది. ఇందుకోసం నిర్ధిష్ట సమయాన్ని రైల్వే శాఖ కేటాయించింది. ఈ నేపథ్యంలో ఈ తత్కాల్ టిక్కెట్ల బుకింగ్ సమయం మారిందంటూ ప్రచారం సాగుతోంది.
భారతీయ రైల్వే తత్కాల్ టిక్కెట్ల బుకింగ్ సమయాల్లో మార్పులు జరిగాయని, నూతన నిబంధనలు ఏప్రిల్ 15వ తేదీ నుంచి అమల్లోకి రానున్నాయంటూ సోషల్ మీడియాలో విస్తృతంగా ప్రచారం సాగుతోంది. దీనిపై కేంద్రం స్పందించింది. ఆ వార్తలు నిరాధారమైనవంటూ స్పష్టం చేసింది. ఇటువంటి అసత్య ప్రచారాలను నమ్మొద్దని పీఐబీ ఫ్యాక్ట్ చెక్ విభాగం సోషల్ మీడియా ద్వారా తెలిపింది.
ఏప్రిల్ 15 నుంచి తత్కాల్ బుకింగ్ సమయాలు మారుతున్నట్టు ఒక ఫోటో సోషల్ మీడియాలో వైరల్ అవుతోందని, అది పూర్తిగా అవాస్తమని తెలిపింది. ఏసీ, నాన్ ఏసీ తరగతులకు తత్కాల్ లేదా ప్రీమియర్ తత్కాల్ బుకింగ్ విషయంలో ప్రస్తుతం అమల్లో ఉన్న సమయాల్లో ఎటువంటి మార్పులు లేవని తెలిపింది. ఏజెంట్లకు అనుమతించిన బుకింగ్ సమయాల్లో కూడా మార్పులు లేవని వీఐబీ ఫ్యాక్ట్ చెక్ స్పష్టం చేసింది.