మిత్రుడు చంద్రబాబుతో కలిసి ఏపీ అభివృద్ధి కోసం పని చేస్తాం : ప్రధాని మోడీ

వరుణ్

గురువారం, 27 జూన్ 2024 (12:03 IST)
మిత్రుడు చంద్రబాబు నాయుడుతో కలిసి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అభివృద్ధి కోసం కలిసి పనిచేస్తామని తనను కలిసి టీడీపీ ఎంపీలకు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ హామీ ఇచ్చారు. బుధవారం సాయంత్రం తెలుగుదేశం పార్టీకి చెందిన ఎంపీలు ప్రధాని మోడీని ప్రత్యేకంగా కలిశారు. పార్లమెంట్‌లోని ప్రధాని కార్యాలయంలో ఈ భేటీ జరిగింది.
 
ఏపీ అభివృద్ధి, ప్రయోజనాలను కాపాడేందుకు సహకరించాలని ఎంపీలు కోరారు. ఇందుకు ఆయన సానుకూలంగా స్పందించారు. ఈ సందర్భంగా టీడీపీ ఎంపీలను ఉద్దేశించి ప్రధాని మోడీ మాట్లాడుతూ, రాష్ట్రంలో, కేంద్రంలో రెండు పార్టీలు కలిసి పని చేస్తాయని తెలిపారు. 
 
దేశం, రాష్ట్ర అభివృద్ధి కోసం శాయశక్తులా కృషి చేస్తామన్నారు. కాగా, ప్రధాని మోడీని కలిసిన వారిలో కేంద్ర మంత్రులు  రామ్మోహన్ నాయుడు, పెమ్మసాని చంద్రశేఖర్, ఎంపీలు, మాగుంట శ్రీనివాసులు రెడ్డి, లావు శ్రీకృష్ణదేవరాయలు, బైరెడ్డి శబరి, వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి, కలిశెట్టి అప్పలనాయుడు తదితరులు ఉన్నారు. 
 
వైజాగ్ స్టీల్ ప్లాంట్‌ను సెయిల్‌లో విలీనం చేయండి.. కేంద్రానికి బీజేపీ ఎంపీల వినితి!! 
విశాఖపట్టణంలోని ప్రభుత్వ రంగ సంస్థగా ఉన్న వైజాగ్ స్టీల్ ప్లాంట్‌ను సెయిల్‌లో విలీనం చేయాలని ఏపీకి చెందిన భారతీయ జనతా పార్టీ ఎంపీలు కేంద్రాన్ని కోరారు. ఈ మేరకు వారు కేంద్ర ఉక్కు, భారీ పరిశ్రమల శాఖామంత్రి హెచ్.డి. కుమారస్వామిని కలిసి వినతిపత్రం సమర్పించారు. 
 
బుధవారం ఏపీ బీజేపీ శాఖ అధ్యక్షురాలు దగ్గుబాటి పురంధేశ్వరి నాయకత్వంలో బీజేపీ ఎంపీలు కేంద్ర మంత్రిని కలిశారు. విశాఖ ఉక్కును సెయిల్‌లో విలీనం చేయాలని కోరుతూ వినతిపత్రం ఇచ్చారు. వారి విజ్ఞప్తికి కేంద్ర మంత్రి సానుకూలంగా స్పందించినట్టు సమాచారం. 
 
ఈ సందర్భంగా స్టీల్ ప్లాంట్‌ను లాభాలబాట పట్టించే అంశాలపై బీజేపీ ఎంపీలు కేంద్ర మంత్రితో చర్చించారు. ఇందుకు సంబంధించిన ప్రణాళికను కూడా సమర్పించారు. విశాఖ ఉక్కు పరిశ్రమకు పూర్వ వైభవం తీసుకునిరావాలని వారు కోరారు. 
 
బీజేపీ ఎంపీల విజ్ఞప్తిపై సానుకూలంగా స్పందించిన మంత్రి... మరోమారు సమావేశమవుదామని వారికి హామీ ఇచ్చారు. కాగా, కేంద్ర మంత్రిని కలిసినవారిలో దగ్గుబాటి పురంధేశ్వరి తో పాటు.. నరసాపురం ఎంపీ శ్రీనివాసవర్మ, అనకాపల్లి ఎంపీ సీఎం రమేష్‌లు తదితరులు ఉన్నారు.

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు